ఇటీవల రాష్ట్రంలో రాజకీయాలు వేడిని రగుల్చుతున్నాయి. దీనిలో భాగంగానే జనసేన పార్టీ సమావేశం కానుంది. ఇటీవల పార్టీ ఎదుర్కొన్న ఇబ్బందులు , పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరగనుంది.ఈ సందర్బంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. కార్యకర్తలకు, నాయకులకు, పార్టీలోకి రావాలని అనుకుంటున్న వారికి రోడ్ మ్యాప్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతుండ డం గమనార్హం. ఇప్పటి వరకు బీజేపీతొ పొత్తులో ఉన్న జనసేన పార్టీ ఇటీవల ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టీడీపీతో చేతులు కలిపింది.
టీడీపీతో చేతులు అయితే కలిపారు కానీ ఎలా ముందుకుసాగాలనే విషయంపై మాత్రం జనసేన కానీ, టీడీపీ కానీ ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ కోసంజనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈనెల 30వ తేదీన సమావేశం కానుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వం లో జరగనున్న ఈ సమావేశంలో విశాఖ పర్యటనలో ప్రభుత్వం నుంచి తలెత్తిన ఇబ్బందులు, తదనంతరం జరిగిన పరిణామాలపై ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం. అంతేకాకుండా అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం, బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేయటం చర్చకు రానున్నాయి.
అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. పవన్ను కలవటంపై రాష్ట్రంలో రాజకీయ మార్పులకు దారితీస్తాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులకు.. రోడ్ మ్యాప్‌ను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అందుకే జనసేన పార్టీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 30, 31న పార్టీకి సంబంధించిన సమావేశాలుంటాయని జనసేన వర్గాలు తెలిపాయి. సమావేశం కారణంగా రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉంటారని పేర్కొన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates