టీడీపీకి కంచుకోట వంటి నియోజకవర్గంలో వైసీపీ పాగా వేసింది. పైగా.. అత్యంత కీలకమైన.. రాజధాని ప్రాంత పరిధిలోని నియోజకవర్గం కావడం.. గమనార్హం. మరి అలాంటి నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ఈ నియోజకవర్గంలో గెలుపు గుర్రం ఎక్కిన నాయకుడు ఎంతగా పనిచేయాలి? ఏమేరకు.. ఆయన వ్యవహరించాలి? అంటే.. చాలానే కష్టపడాలనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. అయితే..ఎవరు ఏమనుకున్నా.. తనకెందుకులే అనుకుంటున్నారో..ఏమో.. తెలియదు కానీ.. గుంటూరు జిల్లాలోని కీలకమైన.. పెదకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మాత్రం.. తన మానాన తాను.. చుట్టపు చూపుగా మాత్రమే నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారనే వాదన వినిపిస్తోంది.
2009, 2014 ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ నేత.. విజయం దక్కించుకున్నారు. ప్రజల నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే.. 2019లో వచ్చిన ఎన్నికల్లో ఆయన వైసీపీ సునామీ కారణంగా గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఈ క్రమంలోనే డాక్టర్ అయిన.. నంబూరి శంకర్రావు.. విజయందక్కించుకున్నారు. అయితే.. గెలిచే వరకు నియోజకవర్గంలో పర్యటించి.. ప్రజలను కలసి.. అనేక హామీలు గుప్పించిన శంకర్రావు.. తర్వాత.. మాత్రం నియోజకవర్గంపై కనీసం.. కన్నేయడం లేదని.. సొంత పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులు.. నంబూరిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు.. వారంలో కనీసం.. రెండురోజులుగా కూడా ఆయన నియోజకవర్గంలో ఉండడం లేదని.. చుట్టపు చూపుగా మాత్రమే నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారని.. కొన్నాళ్లుగా వారు చెబుతున్నారు. అయినా.. కూడా నంబూరి మారడం లేదు. ఇప్పటికీ ఆయన గుంటూరు, హైదరాబాద్ నగరాలకే పరిమితం అయ్యారు. కనీసం.. గడపగడప కార్యక్రమం నిర్వహించాలి.. పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినా.. ఈ కార్యక్రమాన్ని కూడా చాలా లైట్ తీసుకుంటున్నారనిస్థానిక నాయకులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని తెగేసి చెబుతున్నారట. ఇదిలావుంటే.. నంబూరి స్థానంలో తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్టానం వద్ద బలమైన పలుకుబడి ఉన్న రెడ్డి నాయకులు.. ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో నంబూరికి టికెట్ కష్టమని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు రాదని.. రెడ్డి వర్గం ప్రచారం చేస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates