దీక్ష‌కు.. సిద్ధ‌మ‌వుతున్న జ‌న‌సేనాని

“ఔను! ఇదేమంత తేలిక విష‌యం కాదు. దీనిపై తాడోపేడో తేల్చుకోవాల్సిందే”-ఇదీ.. జ‌న‌సేన నాయ‌కులు అంటు మాట‌. సాదార‌ణంగా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు ప్ర‌స్తుత వైసీపీ స‌ర్కారులో అనేక ఇబ్బందులు వ‌స్తున్నాయి. గ‌త ఏడాది అక్టోబ‌రు 2న రోడ్ల‌పై గుంత‌లు పూడ్చేందుకు గాంధీ స్పూర్తితో శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ప్పుడు కూడా.. ఆయ‌న‌ను ఏపీలోకి రాకుండా.. అడ్డుకునే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని.. నాయ‌కులు చెబుతున్నారు. అయినా.. ప‌వ‌న్ ఏదో ఒక రూపంలో వ‌చ్చారు.. త‌ర్వాత‌.. ఆత్మ హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌రామర్శించేందుకు వ‌చ్చినప్పుడు కూడా.. ఇలానే అడ్డంకులు ఏర్ప‌డ్డాయి.

అయినా.. ప‌వ‌న్ ముందుకు సాగారు. కానీ, అప్ప‌టికీ ఇప్ప‌టికీ.. తేడావ‌చ్చింది. జ‌న‌సేన గ్రాఫ్ పుంజుకుంటోంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే.. విశాఖ ప‌ర్య‌ట‌న‌.. ఈ క్ర‌మంలో నిర్వ‌హించే జ‌న‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌పై అనేక ఇబ్బందులు వ‌చ్చాయి. మంత్రుల‌పై దాడి చేశార‌నే కార‌ణంగా.. జ‌న‌సేన పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేయ‌డంతోపాటు.. హ‌త్యాయ‌త్నం కేసులు న‌మోదు చేయ‌డం.. వంటివి జ‌న‌సేన‌లో వేడి పెంచాయి. ముఖ్యంగా ఈ ప‌రిణామాలు..జ‌న‌సేన నాయ‌కుడికి.. ప‌రీక్ష‌గానే మారాయి. పార్టీ పుంజుకుంటున్న ద‌శ‌లో .. నాయ‌కులు.. కార్య‌క‌ర్త‌ల‌కు.. ధైర్యం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

అంతేత‌ప్ప‌.. త‌న మానాన త‌ను వెళ్లిపోతే.. కార్య‌క‌ర్త‌ల‌ను మ‌రింత‌గా ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంటుందని.. అది పార్టీపై రిఫ్లెక్ట్ అవుతుంద‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆదివారం మ‌ధ్యాహ్నం నుంచి ట్వీట్లు చేస్తున్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకుని.. హోట‌ల్ గ‌దిగే ప‌రిమితం అయ్యారు. అంతేకాదు.. రాత్రంతా కూడా.. పార్టీ అభిమానులు.. కీల‌క నేత‌ల‌తో ఆయ‌న టెలీ క‌న్ఫ‌రెన్స్ నిర్వ‌హించి.. మ‌నో ధైర్యం క‌ల్పించిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ నేత‌ల‌తో మాట్లాడుతూనే ప‌వ‌న్ రాత్రంతా.. నిద్ర‌లేకుండా గ‌డిపార‌ని అంటున్నారు. త‌ద్వారా.. పార్టీలో అభిమానుల‌ను కూడ‌గ‌ట్టి.. వారిలో ధైర్యం పెంచేలా చేసిన‌ట్టు చెబుతున్నారు.

ఇంత కీల‌క‌స‌మ‌యంలో వారిని ఒంట‌రిగా వ‌దిలేసేప్ర‌స‌క్తి లేద‌ని.. త‌న పార్టీ నేత‌ల‌పైనా..కార్య‌క‌ర్త‌ల‌పైనా..కేసులు పెట్టిన వారిని.. వ‌దిలేది లేద‌ని కూడా .. ప‌వ‌న్‌.. చెబుతున్నారు. ముందుగా కేసులు ఉప‌సంహ‌రించేలా చేయ‌డం.. అప్ప‌టికీ మాట విన‌క‌పోతే.. నేరుగా.. దీక్ష‌కు సైతం కూర్చోవాల‌ని.. ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే.. హోట‌ల్‌లోనే దీక్ష‌కు దిగాల‌ని భావిస్తున్నార‌ని అంటున్నారు. లేదా.. విజ‌య‌వాడ‌లో అయినా.. ఆయ‌న దీక్ష చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.