విశాఖ ఉక్కు – హైకోర్టు ట్విస్టు !

Vizag Steel Plant

విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రాన్ని హైకోర్టు సూటిగా ఒక ప్రశ్న అడిగింది. ఫ్యాక్టరీ లాభాల్లో ఉన్నపుడు విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమిటి ? అని. తమ ప్రశ్నకు సూటిగా సమాధానమివ్వాలని హైకోర్టు కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని నరేంద్రమోడీ ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయం తీసుకుంది. నిజానికి లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాల్సిన అవసరమే లేదు.

హోలు మొత్తంమీద తీసుకుంటే ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందన్నది వాస్తవం. అయితే పనితీరు మెరుగుపరుచుకుని కొద్ది సంవత్సరాలుగా ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తోంది. అంటే నష్టాలను ఇప్పుడు వస్తున్న లాభాలతో భర్తీచేస్తోంది. అయినా కేంద్రం ఎందుకనో ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేయాలని డిసైడ్ అయ్యింది. ఫ్యాక్టరీకి అతిపెద్ద సమస్య ఏమిటంటే ఉక్కు తయారీకి అవసరమైన ఇనుపగనులు సొంతానికి లేకపోవటమే.

దేశం మొత్తంమీదున్న ఉక్కు ఫ్యాక్టరీల్లో సొంతగనులు లేని ఫ్యాక్టరీ బహుశా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాత్రమేనేమో. ప్రైవేటు ఫ్యాక్టరీలకు కూడా సొంతగనులు కేటాయిస్తున్న కేంద్రప్రభుత్వం విశాఖ ఉక్కుకు మాత్రం సొంతంగా గనులు కేటాయించటంలేదు. సొంతగనులు లేకపోవటంతో ముడి ఇనుమును ఇతర ఫ్యాక్టరీల నుండి లేదా ఓపెన్ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సివస్తోంది. దీని కారణంగానే ఉత్పత్తి సామర్ధ్యం ఎంతున్నా నష్టాలు వస్తున్నది. మిగిలిన ఫ్యాక్టరీలతో పోల్చుకుంటే సామర్ద్యాన్ని బాగా పెంచుకుని నష్టాలను తగ్గించుకుంటున్నది.

అయినా కేంద్రానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంతగనులు కేటాయించాలని అనిపించటంలేదు. ఇదే విషయమై ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, కార్మికులు, రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు ఎంతగా మొత్తుకుంటున్నా మోడీ సర్కార్ పట్టించుకోవటంలేదు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు విచారణ మొదలుపెట్టింది. ఫ్యాక్టరీకి సొంతగనులు లేకపోవటం, కేంద్రం కేటాయించకపోవటం, ఈమధ్య లాభాల్లో ఉండటం లాంటి అనేక విషయాలు విచారణలో ప్రస్తావనకు వచ్చింది. దాంతో ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని కేంద్రం పునఃపరిశీలించాలని హైకోర్టు సూచించింది. అలాగే కొన్ని ప్రశ్నలు సంధిస్తు సమాధానం ఇవ్వాలని నోటీసిచ్చింది.