ముందస్తు ఎన్నికలు తప్పదా ?

ముందస్తు ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతు ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశముందని స్పష్టంగా చెప్పారు. గతంలో కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు తరచూ చెప్పేవారు. అయితే ఎందుకనో కొంతకాలంగా ముందస్తు ఎన్నికల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.

ఇదే సమయంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టిపారేశారు. మరిలాంటి నేపధ్యంలోనే చంద్రబాబు మళ్ళీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన ఎందుకు పట్టుకొచ్చారో అర్ధంకావటం లేదు. ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకాన్ని అభ్యర్థులు తమ పనితీరు ద్వారా కల్పించాలన్నారు. అలా కల్పించలేకపోతే భిన్నమైన నిర్ణయాన్ని తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతి నేత కూడా తనకు టికెట్ ఇస్తే మాత్రమే పార్టీ గెలుస్తుందని చెప్పుకోవటం చాలా సహజం. అలాగే వాళ్ళ మద్దతుదారులు కూడా తమ నేతకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పటం మామూలే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకాన్ని ఆశావహులు ఎలా కల్పించారో అర్ధంకావటం లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే పార్టీలో నేతల పనితీరుపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. కాబట్టి తనకొచ్చే ఫీడ్ బ్యాక్ ప్రకారమే అభ్యర్ధులను ఫైనల్ చేస్తారనటంలో సందేహంలేదు.

ఇక ముందస్తు ఎన్నికల ముచ్చట చూస్తే పార్టీ అందుకు సిద్ధంగా ఉందా అన్నది కీలకం. రెగ్యులర్ గా నియోజకవర్గాల సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాల పర్యటనలు, సమీక్షల సందర్భంగా 40 నియోజకవర్గాల్లో అభ్యర్దులను ఫైనల్ చేశారు. అంటే దాదాపు 100 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఫైనల్ చేయాల్సుంది. ఇదే సమయంలో జనసేనతో పొత్తు తప్పదంటున్నారు. మరి ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు ? మిగిలినవి ఎన్ని అనేది కీలకమైన పాయింట్. ఇది తేలితే ముందస్తు ఎన్నికలకు రెడీ అవటం తేలికే.