కొంత కాలం ముందు వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2గా ఉండేవారు విజయసాయిరెడ్డి. కానీ నెమ్మదిగా ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన స్థానాన్ని ఆక్రమించేశారు. ఆయన్ని వెనక్కి నెట్టేశారు. ఇటీవల పరిస్థితులు చూస్తుంటే విజయసాయికి మూడో స్థానం కూడా దక్కేట్లు కనిపించడం లేదు.
ఆయన పార్టీ అధినేత, ఇతర నేతల విశ్వాసం కోల్పోతున్నట్లే కనిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తే విజయసాయిని వైకాపా డిస్ ఓన్ చేసుకుంటోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మామూలుగా పార్టీ ముఖ్య నేతలు ఎవరి మీదైనా ప్రతిపక్షం, వ్యతిరేక మీడియా నుంచి విమర్శలు, ఆరోపణలు వస్తే.. వైకాపా నుంచి గట్టిగా ఎదురు దాడి ఉంటుంది. ముఖ్యంగా ఆ పార్టీ పత్రిక అయిన సాక్షి మామూలుగా ఎటాక్ చేయదు. గతంలో విజయసాయికి ఆ పత్రిక ఇచ్చిన ప్రాధాన్యమే వేరు.
కానీ తాజాగా విశాఖపట్నంలో విజయసాయి భూ దందా గురించి ఈనాడు పత్రిక ఒక సంచలన కథనం ప్రచురించగా.. దాని గురించి అసలు వైకాపా వైపు నుంచి సౌండే లేదు. ఆ పార్టీ తరఫున ఒక ఖండన లేదు. వేరే నేతల నుంచి స్పందన లేదు. ముఖ్యంగా సాక్షి పత్రిక ఇంతకుముందులా విజయసాయిని వెనకేసుకొస్తూ ఈనాడు మీద ఎదురు దాడి చేయడం అస్సలు కనిపించలేదు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా సాక్షి విస్మరించింది. వైకాపా నేతలు ఇంకెవరు కూడా దీన్ని ఖండించలేదు.
విజయసాయి కూడా రెండు రోజులు మౌనంగా ఉండి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తన ఫ్రస్టేషన్ అంతా బయటపెట్టుకున్నారు. ఆయన డిఫెన్స్ పూర్తిగా తేలిపోయింది. తన కూతురు, అల్లుడు ఆస్తులు కొంటే తనకేం సంబంధం అనేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతల మీద ఇలాంటి ఆరోపణణలు, ఆధారాలు లేకుండా ఎన్ని చేశారో లెక్కలేదు. ఈ విషయానికి కూడా కులం రంగు పులుముతూ ఆయన చేసిన ఎదురు దాడి తుస్సుమనిపించింది.
ఈ వివాదం విషయంలో ఆయన సోలో బ్యాటింగ్ చేస్తున్నారే తప్ప వైకాపా నుంచి సపోర్ట్ లేదు. ఇదిలా ఉండగా.. మధ్యలో వైజాగ్ ఎంపీకి సంబంధించి ఓ రియల్ ఎస్టేట్ వివాదం గురించి ఆయన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు విశాఖ కేంద్రంగా వైకాపాలో నెలకొన్న కుమ్ములాటలకు కూడా నిదర్శనంగా నిలవడం గమనార్హం.