అందరిని ఆశ్చర్యపరిచిన గద్దర్ !

ఉద్యమ నేపథ్యం ఉన్న ప్రజా గాయకుడు గద్దర్ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. కారణం ఏమిటంటే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకోవటమే. దీనికన్నా ఇంకా పెద్ద సర్ ప్రైజ్ ఏమిటంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా ఎన్నికలోకి దిగుతుండటమే. తెలంగాణాలోని రాజకీయ పార్టీలు అలాగే జనాలు ఈ రెండు విషయాలను ఏమాత్రం ఊహించలేదు. ఉద్యమ నేపథ్యం ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఏమీలేదు. కాకపోతే గద్దర్ ఎన్నికల్లో పోటీ చేస్తారని అదీ ప్రజాశాంతి పార్టీ తరపున దిగుతారని మాత్రం అనుకోలేదు.

ఇక్కడ విషయం ఏమిటంటే గద్దర్ మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని అనుకుంటే టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలే అవకాశమిచ్చేవేమో. లేకపోతే వామపక్షాల తరపున పోటీచేయాలని అనుకున్నా సీపీఐ+సీపీఎం కలిసి గద్దర్ కు మద్దతుగా నిలిచేవేమో. ప్రజాశాంతి పార్టీ తరపున పోటీచేయటం కన్నా వామపక్షాల తరపున పోటీచేయటం మంచిదే కదా. ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ ని జనాలెవరూ ఒక రాజకీయ పార్టీగా చూడటం లేదు. దాని వ్యవస్థాపక అధ్యక్షుడు, మత ప్రభోదకుడు కేఏ పాల్ ను కమెడియన్ గానే చూస్తున్నారు.

పార్టీ విషయాన్ని గానీ లేదా కేఏ పాల్ వైఖరిని కానీ గద్దర్ గమనించకుండానే ఉంటారా ? కనీసం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా బాగానే ఉంటుంది కదానే చర్చలు మొదలయ్యాయి. అంటే ప్రజాశాంతి పార్టీపై జనాల్లో ఎలాంటి భావనుందో అందరికీ అర్ధమవుతోంది. గద్దర్ అనే వ్యక్తి సమాజంలో చాలా పాపులర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దశాబ్దాల పాటు ఉద్యమ నేపథ్యంలో పనిచేసి, ప్రజాగాయకుడిగా గద్దర్ ఎంతో పాపులర్. ఏ పార్టీ తరపున పోటీచేసినా తనను తాను జనాలకు పరిచయటం చేసుకునే విషయంలో గద్దర్ కష్టపడక్కర్లేదు. ఇన్ని అవకాశాలను వదిలేసి కేఏ పాల్ పార్టీ తరపున పోటీ చేస్తుండటమే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. గద్దర్ వల్ల పార్టీకి ప్రచారం రావాలే కానీ పార్టీవల్ల గద్దర్ కు జరిగే ఉపయోగం ఏమీలేదన్నది నూరుశాతం వాస్తవం.