రాజకీయం క్రీడ కాదు..టాస్క్: కేసీఆర్

విజయదశమి పండుగనాడు జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్…బీఆర్ఎస్ గా కొనసాగుతుందని అన్నారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడ అని, కానీ తనకు మాత్రం రాజకీయం అంటే ఒక టాస్క్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మన దేశంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, బీజేపీ ప్రభుత్వం వల్లే రైతాంగం నానా ఇబ్బందులు పడుతోందని కేసీఆర్ దుయ్యబట్టారు.

మోడీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, ఆఖరికి బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసం, రైతుల సంక్షేమం కోసమే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు. రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ప్రధాన ఎజెండా అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తాను దేశంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించానని, ఆ సందర్భంగా టీఆర్ఎస్ ను తెలంగాణకే పరిమితం చేయవద్దని చాలామంది తనను కోరారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

ముందుగా కర్ణాటక, మహారాష్ట్రలలో బీఆర్ఎస్ కార్యకలాపాలు మొదలవుతాయని కేసీఆర్ అన్నారు. ఇక, యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఉన్నారని, అందుకే ఈ సమావేశానికి ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ ను ఈ సమావేశానికి రావద్దని చెప్పామని అన్నారు. త్వరలోనే మిగిలిన రాష్ట్రాలకు చెందిన నేతలందరూ తనతో జతకడతారని కేసీఆర్ అన్నారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని, ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని కేసీఆర్ ఆకాంక్షించారు.