మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు బాగా కష్టపడుతున్నాయి. మూడు పార్టీలోను మైనస్సులు, ప్లస్సులున్నాయి. అయితే టీఆర్ఎస్, బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్ధితే కాస్త నయమన్నట్లుగా ఉంది. ఇప్పటి వాతావరణాన్ని బట్టి కచ్చితంగా ఎవరు గెలిచేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కప్పల తక్కెడ లాగ నేతలు ఒక పార్టీలో నుండి మరోపార్టీలోకి దూకేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా వ్యవహారం ఇలాగే ఉంటుంది.
కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ గెలుపోటములపై సరైన అంచనాకు రాలేరు. ఈలోగా పార్టీల పరిస్ధితి చూస్తే మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. టీఆర్ఎస్ తరపున ఎవరిని పోటీలోకి దించాలో కేసీయార్ కే అర్ధం కావటంలేదు. కేసీయార్ మనసులో కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికే టికెట్ ఇవ్వాలని బలంగా ఉన్నా ప్రకటించలేకపోతున్నారు. ఎందుకంటే కూసుకుంట్లను నియోజకవర్గంలోని నేతల్లో అత్యధికులు బహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. ఆయనకే టికెట్ ఇస్తే ఓడగొడతామని డైరెక్టుగా కేసీయార్ కే చెప్పారు.
ఇక బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యవహారం మరో తీరుగా ఉంది. బీజేపీ నేతల్లో కొందరు ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఉన్నవాళ్ళల్లో చాలామంది అసలు రాజగోపాలరెడ్డికి సహకరించటంలేదని టాక్. పైగా రాజగోపాల్ తో వచ్చిన నేతలకు అసలు నేతలకు ఏమాత్రం పడటంలేదట. తనతో పాటు కాంగ్రెస్ లో నుండి మొత్తం నేతలంతా వచ్చేస్తారని ఊహించుకున్న రాజగోపాల్ కు చాలామంది షాకిచ్చారు. దాంతో ప్రచారంలో రాజగోపాలరెడ్డి బాగా ఇబ్బంది పడుతున్నారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి శ్రావణి నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈమెకు ప్రచారంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావటంలేదు. కాకపోతే నియోజకవర్గంలో బాగా పట్టున్న భువనగిరి ఎంపీ, రాజగోపాలరెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్దగా సహకరించటం లేదట. ఎంపీని వదిలేస్తే మిగిలిన సీనియర్లంతా తమకు కేటాయించిన మండలాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. సో టీఆర్ఎస్, బీజేపీతో పోలిస్తే ఇప్పటికి కాంగ్రెస్ అభ్యర్ధే కాస్త నిమ్మళంగా ఉన్నట్లు లెక్క.