కేంద్రాన్ని కేసీయార్ ఇరుకున పెట్టారా ?

కేంద్ర ప్రభుత్వం-కేసీఆర్ మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కేసీయార్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాల్సిందే అని బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే కేంద్రం-కేసీయార్ మధ్య మాటల యుద్ధం తారాస్ధాయిలో జరుగుతోంది. నిజానికి ఈ మాటల యుద్ధం విదానపరమైన అంశాల మీద జరిగితే బాగానే ఉంటుంది.

కానీ జరుగుతున్న దాంట్లో అత్యధికం వెర్బల్ పొల్యూషన్ అనటంలో సందేహం లేదు. ఒకరిపై మరొకరు అనవసరమైన వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే కాలం గడచిపోతోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా దాంతో రాజకీయ కాలుష్యం కూడా బాగా పెరిగిపోతోంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే చర్యను కేసీయార్ అమల్లోకి తెచ్చారు. దీంతో ఏమి చేయాలో బీజేపీ నేతలకు దిక్కుతోచటం లేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తు కేసీయార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. నిజానికి రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రిజర్వేషన్లన్నది కేంద్రప్రభుత్వం పరిధిలోని అంశం. అయినా సరే గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని 10 శాతానికి పెంచేసి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు కూడా వెంటనే అమల్లోకి వచ్చేస్తుందని నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇక్కడే కేంద్రం ఇబ్బందులో పడింది.

కేసీయార్ తీసుకున్న నిర్ణయం చెల్లదంటు కేంద్రం చెప్పిందంటే గిరిజనుల మద్దతు బీజేపీ దక్కే అవకాశం లేదు. అలాగని ఏమీ మాట్లాడకుండా చూస్తు ఊరుకుంటే రిజర్వేషన్ అమల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఆ క్రెడిటంతా కేసీయార్ కే దక్కుతుంది. అంటే ఏరకంగా చూసినా బీజేపీకి ఇబ్బందనే చెప్పాలి. గతంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు జారీచేసిన ఉత్తర్వులే వివాదాస్పదమై కోర్టు విచారణలో మగ్గుతోంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రిజర్వేషన్లు మొత్తం 62 శాతానికి చేరుతుంది. రిజర్వేషన్లు 50 శాతంకు మించకూడదన్న సుప్రింకోర్టు ఆదేశాలకు ఇది పూర్తి విరుద్ధం. మరిపుడు నరేంద్రమోడీ ప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాల్సిందే.