తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఫాలో అయ్యే వారికి ఈ పేరు సుపరిచితమే. టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న సంతోష్ కుమార్….తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి కూడా. కేసీఆర్ సతీమణి తరఫు బంధువైన సంతోష్ కుమార్…చాలా కాలంగా కేసీఆర్ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటూ ఆయనకు ఆంతరంగికుడిగా పాపులర్ అయ్యారు. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో సంతోష్ కుమార్ ను కేసీఆర్ మందలించినట్టుగా పుకార్లు వచ్చాయి.
ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సంతోష్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం కూడా ఆ పుకార్లకు ఊతమిచ్చింది. దాంతోపాటు కొద్దిరోజులుగా కేసీఆర్ వ్యక్తిగత వ్యవహారాలను చూసుకోవడానికి కూడా సంతోష్ హాజరు కాకపోవడంతో కేసీఆర్, సంతోష్ ల మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ లిక్కర్ స్కాం నేపథ్యంలో సంతోష్ తో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న వెన్నమనేని శ్రీనివాసరావును ఈడీ అధికారులు విచారణ జరిపారు.
అయితే, వెన్నమనేనితో కలిసి సంతోష్ పలు వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో, ఆ విచారణ తర్వాత కేసీఆర్ తో సంతోష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంతోష్ ను కేసీఆర్ మందలించారని ఊహాగానాలు వస్తున్నాయి. ఆ తర్వాతే సంతోష్ తన ఫోన్ స్విచాఫ్ చేశారని ప్రచారం జరుగుతోంది. గత మూడు రోజులుగా సంతోష్ తన విధులకు, పార్టీకి దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే, ఈ పుకార్లను కొందరు టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. మరికొందరేమో వేరే విషయంలో సంతోష్ ను కేసీఆర్ కాస్త మందలించారని, అందుకే గ్యాప్ వచ్చిందని అంతర్గతంగా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా..ఈ టీ కప్పులో తుఫాను సంగతేంటో తేలాలంటే కాస్త వేచి చూడక తప్పదు.