షర్మిల మీద కౌంటర్లు మొదలయ్యాయా ?

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీద కూడా వైసీపీ నుండి కౌంటర్లు మొదలయ్యాయి. మొదటి కౌంటర్ ను సంధించింది మంత్రి జోగి రమేష్. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీని కారణంగా వైసీపీ-టీడీపీ అండ్ పార్టీలు, నేతల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కౌంటర్లు గట్టిగా పడుతున్నాయి. ఇదే సమయంలో ఆ కౌంటర్లకు వైసీపీ నుండి కూడా సమాధానాలు వినబడుతున్నాయి.

అయితే ఈ విషయంలో షర్మిలకు ఎలాంటి సంబంధంలేకపోయినా ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. ఒకళ్ళ పేరు తీసేసి మరోకళ్ళ పేరు పెట్టడం ఎంతమాత్రం మంచిపద్దతి కాదని కాస్త ఘాటుగానే స్పందించారు. షర్మిలకు ఈ విషయంలో సంబంధంలేదని చెబుతున్నది ఎందుకంటే గతంలో చాలాసార్లు ఏపీ రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధంలేదని స్వయంగా ఆమె ప్రకటించున్నారు కాబట్టే.

అలాంటిది మరిపుడు ఏ సంబంధం ఉందని స్పందించారో తెలీదు కానీ దొరికిన అవకాశాన్ని జగన్ కు వ్యతిరేకంగా షర్మిల ఉపయోగించుకోవాలని అనుకున్నారనే విషయం మాత్రం అర్ధమవుతోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా షర్మిలకు వ్యతిరేకంగా మంత్రి స్పందించారు. నిజానికి షర్మిల గురించి వైసీపీలో ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఇంకెవరూ నోరిప్పటంలేదు. సజ్జల కూడా ఎంత వీలుంటే అంత తక్కువగానే మాట్లాడుతారు.

అలాంటిది ఇపుడు షర్మిల తన సోదరుడికి వ్యతిరేకంగా ఓపెన్ గా స్పందించారు. దాంతో జగన్ దగ్గరనుండి కూడా ఏమైనా ఆదేశాలు అందాయేమో అందుకనే మంత్రి షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడారు. పేరు మార్పు విషయంలో అసెంబ్లీలో జగన్ స్పీచ్ ను షర్మిల చూసుండరని మంత్రి అభిప్రాయపడ్డారు. పైగా తెలంగాణాలో పరిస్ధితులు వేరుగా ఉన్నాయి కదా అంటు కాస్త వ్యంగ్యంగా అన్నారు. ఒకవేళ జగన్ ప్రసంగాన్ని వినుంటే ఇలాగ మాట్లాడేవారు కాదన్నారు. మాట్లాడింది మెత్తగానే అయినా గట్టిగానే చెప్పారు. చూడబోతే షర్మిల స్పందనను బట్టి వైసీపీ నేతల డోసు పెరుగుతుందేమో చూడాలి.