తూర్పుగోదావరి జిల్లాలోని అధికార పార్టీ సీనియర్ నేత జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం. రాజోలుకు చెందిన బొంతు రాజేశ్వరరావు తొందరలోనే జనసేనలో చేరబోతున్నారట. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఒక పార్టీకి రాజీనామా చేసిన నేత మరోపార్టీలో చేరటం సహజమే కదా. పైగా ఎన్నికలకు ముందు చేరితే కచ్చితంగా నియోజకవర్గంలో టికెట్ హామీ తీసుకునే రాజీనామా చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రాజోలులో సమస్య ఏమిటంటే 2019 ఎన్నికల్లో జనసేన తరపున రాపాక వరప్రసాద్ గెలిచారు. అయితే ఈయన వైసీపీ నేత అయినా టికెట్ దక్కని కారణంగా అప్పటికప్పుడు జనసేనలో చేరారు. టికెట్ తెచ్చుకోవటం, గెలవటం వెంటవెంటనే జరిగిపోయాయి. గెలిచిన తర్వాత రాపాకకు పార్టీలో కూడా పెద్దగా ప్రాధాన్యత దక్కని కారణంగా ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. అప్పటినుండి రాపాకు-బొంత మధ్య నియోజకవర్గంతో పాటు పార్టీలో పెద్ద యుద్ధమే నడుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో బొంతుకు టికెట్ దక్కేది అనుమానమే అని తెలిసింది. 2014, 19 వరస ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసిన బొంతు ఓడిపోయారు. అయినా మూడోసారి కూడా తనకే టికెట్ కావాలని బొంతు పట్టుబట్టారు. దానికి జగన్ సాధ్యం కాదన్నట్లున్నారు. బహుశా వచ్చే ఎన్నికల్లో రాపాక వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో పార్టీలో పరిణామాలను చూసిన తర్వాత ఇక వైసీపీలో ఉండి లాభంలేదని బొంతు డిసైడ్ అయినట్లున్నారు.
అందుకనే ఈమధ్యనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. బహుశా రాజోలులో టికెట్ హామీ తీసుకున్నట్లున్నారు. జనసేనకు కూడా రాజోలులో గట్టి నేత అవసరముంది. అందుకనే పవన్ కూడా బొంతుకు టికెట్ హామీ ఇచ్చినట్లున్నారు. హామీ తీసుకున్న తర్వాతే బొంతు గురువారం వైసీపీకి రాజీనామా చేసినట్లు పార్టీవర్గాలే చెబుతున్నాయి. కాబట్టి తొందరలోనే బొంతు జనసేనలో చేరటం ఖాయమని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates