ఎక్కడైనా ఏ పార్టీ నేతలైనా.. తమ పార్టీని.. తమ పార్టీ అభ్యర్థులను పట్టుబట్టి మరీ గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది సహజం కూడా. అధిష్టానం ఆదేశాలు ఉన్నా..లేకున్నా.. పార్టీ తరఫున ఎవరు నిలబడ్డా.. తమకు ఉపయోగపడతారు.. గెలిపిస్తే.. పోలా! అనేలా వ్యవహరిస్తారు. అయితే.. వైసీపీ విషయంలో మాత్రం ఈ పరిస్థితి రివర్స్ అవుతోందని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలను ఓడించేందుకు సొంత పార్టీ నాయకులే రెడీ అవుతున్నారని అంటున్నారు.
ప్రస్తుతం ఈ చర్చ అధికార పార్టీలోనే ఎక్కువగా సాగుతుండడం గమనార్హం. గుంటూరు విషయానికి వస్తే.. సత్తెనపల్లి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదేవిధంగా పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాలు అయితే.. దాదాపు ఓడించే నియోజకవర్గాల జాబితాలో చేరిపోయాయని అంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని.. వైసీపీ నాయకులు నిర్ణయించేసుకున్నారు. అంతేకాదు.. మరోసారి వీరిని గెలిపిస్తే.. ఇక, తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని.. తమ అడ్రస్‌లు కూడా గల్లంతవుతాయని భావిస్తున్నారట.
దీంతో ఆయా నియోజకవర్గాల్లో నేతలను ఓడించేందుకు నాయకులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక, ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మైలవరం, జగ్గయ్యపేట, గన్నవరం నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. మైలవరంలో అయితే..ఎమ్మెల్యే సొంత సామాజిక వర్గంకారాలు మిరియాలు నూరుతోంది. తమను ఎన్నికల్లో వాడుకుని.. తర్వాత వదిలేశారని.. దొడ్డిదారుల్లో సొమ్ములు పోగేసుకుంటున్నారని.. నాయకులు వాదన వినిపిస్తున్నారు. దీంతో మైలవరంలో మళ్లీ వసంతకు టికెట్ ఇవ్వద్దని.. ఇస్తే.. ఓటమి ఖాయమని .. కీలక నేతలు వాదిస్తున్నారు.
ఇక, జగయ్యపేటలోనూ ఇదే వాదన వినిపిస్తోంది. మమ్మల్ని పట్టించుకోండి సారూ! అని ఎమ్మెల్యే సామినేనికి ఇక్కడి నాయకులు మొర పెట్టుకుంటున్నా.. ఆయన మాత్రం వీరిని పట్టించుకోవడం లేదు. దీంతో వారంతా సామినేనికి యాంటి అయ్యారని తెలుస్తోంది. ఇక, గన్నవరం గురించి ఎంత తక్కువ చెప్పుకొన్నా ఎక్కువే. ఇక్కడ తమకు మాత్రమే టికెట్ ఇవ్వాలని.. యార్లగడ్డ, దుట్టాలు.. ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు మరో వాదన తెరమీదకిఇ తెచ్చారు. మాకు ఇవ్వకపోయినా.. ఫర్లేదు.. వంశీకి మాత్రం ఇవ్వడానికి వీల్లేదని తీర్మానాలు చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీని ప్రత్యేకంగా టీడీపీ నేతలు ఓడించే ప్రయత్నం చేయడం అవసరం లేదని.. వైసీపీ నేతలే ఓడిస్తారని పరిశీలకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates