నాన్ ఎన్డీయే పార్టీలను ఏకం చేయడానికి మూడో కృష్ణుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ మూడో కృష్ణుడంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనే అర్ధం. మూడో కృష్ణుడని ఎందుకంటున్నామంటే మొదటి ప్రయత్నం బెంగాల్ సీఎం మమతాబెనర్జీ చేశారు కాబట్టి. రెండో ప్రయత్నం తెలంగాణా సీఎం కేసీయార్ చేశారు. మమత ఇప్పటికే ఫెయిలయ్యారు. కేసీఆర్ ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకనే ఇపుడు ముచ్చటగా మూడో ప్రయత్నం నితీష్ మొదలుపెట్టారు.
ఢిల్లీలో వామపక్షాల జాతీయ నాయకులతోను, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళతో నితీష్ భేటీ అయ్యారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవటమే తన ధ్యేయంగా చెప్పారు. తనకు ప్రధానమంత్రి అభ్యర్థి కావాలనే ఆలోచన కానీ కోరిక కానీ లేవని నితీష్ స్పష్టంగా ప్రకటించటమే కీలక పరిణామం.
ఎందుకంటే నాన్ ఎన్డీయే పార్టీలకు నాయకత్వం వహించాలని ప్రయత్నించిన వాళ్ళకు ప్రధాని అభ్యర్ధిగా ఉండాలన్న కోరికుండేది. ఈ కోరికను బయటకు చెప్పుకోలేక అలాగని నాయకత్వం అవకాశాలు ఇతరులకు ఇవ్వలేకపోవటంతోనే ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. తాజాగా నితీష్ మాట్లాడుతు కాంగ్రెస్, వామపక్ష, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపివ్వటమే అసలు సమస్య. కాంగ్రెస్, వామపక్షాలు గతంలో కూడా కలిశాయి రేపు కలవటానికి కూడా ఇబ్బందిలేదు. సమస్యల్లా మమతా బెనర్జీ, కేసీయార్ లాంటి వాళ్ళతోనే. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో చేతులు కలిపి బెంగాల్, తెలంగాణలో కాంగ్రెస్ తో పోరాటాలు చేయటం సాధ్యం కాదు.
ఒకవేళ మమత, కేసీయార్ ఆ మాట చెప్పినా జనాలు నమ్మరు. జనాలు నమ్మకపోగా గందరగోళం బాగా పెరిగిపోతుంది. కేసీయార్ ను పక్కన పెట్టేసినా మమత కలవకపోతే విపక్షాల ఐక్యత సాధ్యం కాదు. ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఫోకస్ అవ్వాలని మమత, కేసీయార్, శరద్ పవార్ లాంటి వాళ్ళకు బలంగా ఉంది. కానీ ఆ మాటను బయటకు చెప్పటంలేదు. అందుకనే కాంగ్రెస్ తో జాతీయ స్ధాయిలో కలసి పనిచేయటానికి వీళ్ళు అంగీకరించటం లేదు. మరి మూడో ప్రయత్నం ఏమవుతుందో చూడాల్సిందే.