గుజ‌రాత్‌లో రాహుల్ హామీలే హామీలు..

Rahul Gandhi

కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుతం క్లిష్ట ప‌రిస్థితిలో ఉంది. దీనిని గ‌ట్టెక్కించే చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన ఆ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు మ‌రిన్ని ఆయుధాలు అందించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జాతీయ స్థాయి పార్టీని ఆయ‌న ప్రాంతీయ పార్టీగా మారుస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్లు. ఎందుకంటే.. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్‌ను ఆయ‌న టార్గెట్ చేసుకున్నారు. వాస్త‌వానికి ఇక్క‌డ కాంగ్రెస్ బ‌లం గ‌త పాతికేళ్లుగా ఏమీ లేద‌నే చెప్పాలి. ఎందుకంటే.. 27 సంవ‌త్స‌రాలుగా ఇక్కడ బీజేపీ పాల‌న సాగుతోంది.

ఈ క్ర‌మంలో రాహుల్‌.. తాజాగా జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. అయితే.. ఆయ‌న స్థానికంగా ఉన్న స‌మ‌స్యలను ప్ర‌స్తావించి.. హామీలు ఇస్తే.. స‌రిపోయేది.. కానీ, జాతీయ స్థాయిలో స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. వాటిని ప్రాంతీయ స్థాయికి ముడిపెట్టి గుజ‌రాతీల‌కు హామీలు గుప్పించారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని రాహుల్‌ ప్రకటించారు. ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న వంటగ్యాస్‌ సిలిండర్‌ను 500 రూపాయలకే అందిస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు.

ఈ మూడు హామీలు కూడా దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ ప్ర‌క‌టించి ఉంటే బాగుండేది. కానీ, రాష్ట్ర స్థాయిలో ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. అదే స‌మ‌యంలో పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.5 సబ్సిడీ ఇస్తామని రాహుల్ ప్ర‌క‌టించారు. బాలికలకు ఉచిత విద్య అందిస్తామన్నారు. సాధారణ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, అధికారంలోకి వస్తే 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పారు. 3 వేల ఆంగ్ల మాద్యమ పాఠశాలలు నిర్మిస్తామని.. బాలికలకు ఉచిత విద్య అందిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు.

ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిర్మించిందని రాహుల్ గాంధీ అన్నారు. కానీ పటేల్ ఎవరి కోసమైతే పోరాడారో, ఏ ప్రజల కోసమైతే తన ప్రాణాలను అర్పించారో వారికే అది వ్యతిరేకంగా పనిచేసిందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రవేశ పెట్టి రద్దు చేసిన వ్యవసాయ చట్టాలు.. రైతుల హక్కుల్ని కాలరాసేలా ఉన్నాయన్నారు. గుజరాత్లోని ప్రతి సంస్థను బీజేపీ స్వాధీనం చేసుకుందని.. ఇక్కడ యుద్ధం రెండు పార్టీల మధ్య కాదు, అధికార పక్షం స్వాధీనం చేసుకున్న ప్రతి సంస్థతో అని ఆయన ఆరోపించారు. ఏదేమైనా.. రాహుల్ వంటి నాయ‌కులు హామీ ఇస్తే.. అది దేశం మొత్తాన్ని ప్ర‌భావితం చేసేలా ఉండాలి కానీ.. ఇలా ప్రాంతీయ రాజ‌కీయాల‌పై కాద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. రేపు ఇవే హామీల‌ను దేశం మొత్తానికి ఇచ్చే సాహ‌సం.. చేయ‌గ‌లరా? అని ప్ర‌శ్నిస్తున్నారు.