దేశ అతి ప్రాచీన పార్టీ.. కాంగ్రెస్‌లో రాహుల్ రగడ కొనసాగుతూనే ఉంది. నిన్న మొన్నటి వరకు గ్రూప్-23 మంది నాయకులు ఏ మాట అయితే.. మాట్లాడారో.. ఇప్పుడు కీలక నాయకుడు.. కేంద్ర మాజీ మంత్రి.. ఆజాద్ కూడా అదే చెప్పారు. రాహుల్ వ్యవహారంతో విసుగు చెందే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన వెల్లడించారు. అంతేకాదు.. రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తన చుట్టూ ఏర్పాటు చేసుకున్న కోటరీనే ఆయన నమ్ముతున్నారని.. ఇంటి నుంచి బయటకు ఆయన రావడం లేదని దుయ్యబట్టారు.
“పిల్ల చేష్టలు ఇంకా ఎన్నాళ్లు భరిస్తాం. సీనియర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు“ అని ఆజాద్ చేసిన వ్యాఖ్యలు అంత తేలికగా తీసుకునేవి కావు. చాలారోజుల నుంచి జీ-23 నేతలు చెబుతున్నవే. ఏఐసీసీని నడిపే కోటరీ ఆధ్వర్యంలో పోరాడాలన్న సంకల్పం, సామర్థ్యాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. భారత్ జోడో యాత్ర కన్నా ముందు పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ జోడో యాత్రను చేపట్టాల్సిందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.
రాహుల్‌గాంధీ ప్రవేశంతోనే కాంగ్రెస్‌కు కష్టాలు ఆరంభమయ్యాననే వాదన కూడా ఎప్పటి నుంచో ఉంది. ఇక, ఇప్పుడు అదే ఆక్రోశం.. ఆజాద్‌లోనూ కనిపించింది. రాహుల్ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైందని, అనుభవజ్ఞులైన నేతలను రాహుల్ పక్కకు పెడుతున్నారంటూ విమర్శించారు. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకొని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. పార్టీలోని సంస్థాగత మార్పుల కోసం లేఖ రాసిన 23 మంది నేతలను తీవ్రంగా అవమానించారని అని ఆయన అన్నారు.
గత ఎన్నికల నుంచి …
2019 ఎన్నికల నాటి నుంచి పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోంది. యూపీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని దెబ్బతీసిన రిమోట్ కంట్రోల్ విధాన్నానే ఇప్పటికీ కాంగ్రెస్‌లో అమలు చేస్తోంది. పార్టీకి సంబంధించిన చాలా విషయాల్లో సోనియాగాంధీ పాత్ర నామమాత్రమేననే విషయం అనేక మంది చెబుతున్నారు. ఆజాద్ రాజ్యసభ పదవీకాలం గతేడాది ముగియగా ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను పెద్దల సభకు పంపలేదు. చాలాకాలంగా కాంగ్రెస్కు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు ఆజాద్. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా సోనియా గాంధీ అప్పగించిన బాధ్యతలను ఆయన తిరస్కరించారు. ఎలా చూసుకున్నా.. రాహుల్ ఘన కార్యాయాల కారణంగా.. ఇప్పటికి రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్.. ఇక, ఇప్పుడు.. పతనం అంచున సర్కస్ చేసే పరిస్థితికి దిగజారిందనడంలో సందేహం లేదు.