రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూల్చేస్తున్న మోడీ: కేసీఆర్

దేశం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ఇప్పటి వరకు ఒక్క మంచి పనిచేయలేదని మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంతో పాటు దేశం బాగుండాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపాల్సిన ప్రధాని మోడీయే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.

ఇవాళ ఏం లొల్లి జరుగుతోంది. కేంద్రంలో ఉండే ప్రధానమంత్రే 9 రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను కూలగొట్టారు. తమిళ నాడు, పశ్చిమబెంగాల్, డిల్లీ ప్రభుత్వాలను కూలగొడతారంటా. బెంగళూరు అనేది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఇవాళ ఏం జరుగుతోంది. ఈ ఏడాది మన హైదరాబాద్లోనే ఎక్కువ ఉద్యోగాలొచ్చాయి. కారణం ఏంటంటే బెంగ‌ళూరులో మత విద్వేషాలు రెచ్చగొట్టడం. కేంద్ర ప్రభుత్వం ఒక్కటైనా మంచిపని చేసిండ్రా. ఒక్క ప్రాజెక్ట్ కట్టిండ్రా. ఏం చేసిండ్రు అని అడుగుతున్నా. కనీసం మంచినీళ్లు ఇచ్చే తెలివి లేదా? దేశానికి కనీసం మంచినీళ్లు ఇవ్వలేరా? 70 టీఎంసీల నీళ్లు నదుల్లో పారుతూ ఉంటే మీకు సోయి లేదా?అని నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రిగా తాను, ప్రధానిగా మోడీ ఒకేసారి ప‌ద‌వుల్లోకి వ‌చ్చామ‌ని.. కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు ఇవ్వడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను మౌనంగా భరిద్దామా? పిడికిలి బిగించి కొట్లాడుదామా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ వ్యవస్థలను ఆగం చేస్తున్నారని సీఎం కేసీఆర్ అగ్రహం వ్యక్తం చేశారు. డిల్లీలో రూ.25 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామని అంటున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు.  

నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను ఆగం కానివ్వనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మత పిచ్చిగాళ్ల ఎలాంటి దుర్మార్గాలను సాగనివ్వనని హెచ్చరించారు. మత పిచ్చికి లోనైతే బతుకులు ఆగమవుతాయన్నారు. స్వార్థ మత పిచ్చిగాళ్లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సమాజంలో అసూయ, ద్వేషం పెరిగితే భారత్తో పాటు తెలంగాణ 100 ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారు. మోడీ.. మేము మనుషులం కాదా? దేశంలో భాగం కాదా? అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  జాతీయ రాజకీయాల్లో ఉజ్వల పాత్ర నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.