అధికార పార్టీ నాయకుడి ఇంట్లో శుభకార్యం అంటే.. ఆ హంగు ఆర్భాటం డిఫరెంట్‌గా ఉంటాయి. ఆకాశమంత పందిరి.. భూదేవంత పీటలు.. అంటూ.. ఆ హంగును వర్ణించేందుకు మాటలు చాలవు.. అన్నరేంజ్‌లో ప్రస్తుతం నాయకుల ఇళ్లలో కార్యక్రమాలు జరుగుతాయి. అయితే.. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ కార్యక్రమం పేరుతో సాధారణ వ్యక్తుల నుంచి చేస్తున్న వసూళ్లే.. ఒకింత ఇబ్బందిగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎలాంటి ఆదాయం లేని.. సర్పంచుల నుంచి కానుకలు ఇవ్వాలంటూ.. మెసేజ్‌లు పెట్టడం.. వారిపై ఒత్తిడి తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి త్వరలోనే జరగనుంది. అయితే.. దీనికి సంబందించి.. సర్పంచులు కానుకలు పంపించాలంటూ.. మెసేజ్ వైరల్ అవుతున్నాయి. అది కూడా ఏకంగా ఒక్కొక్కరూ రూ.5000 చొప్పున పంపించాలని కోరడం.. వివాదానికి దారితీస్తోంది. దీనిపై నియోజకవర్గంంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ నాయకుడు సుంకె రవిశంకర్ విజయం సాధించారు. త్వరలోనే ఆయన తన కుమార్తెకు వివాహం జరిపించనున్నారు.
అయితే.. ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు నాయకులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి భారీ ఎత్తున కానుకలు సమర్పించే పనిలో పడ్డారు. దీనికి గాను సర్పంచుల నుంచి వసూళ్ల పర్వం ప్రారంభించారనే ఆరోపణలు వస్తున్నాయి. సర్పంచుల ఫోరం పేరుతో ఒక మెసేజ్ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తోంది. ఒక్కొక్క సర్పంచ్ రూ.5 వేల రూపాయలు ఇవ్వాలని.. ఈ మేరకు ఫోరం పెద్దలు నిర్ణయించారని.. ఈ సందేశంలో పేర్కొన్నారు.
అంతేకాదు.. ఈ సొమ్మును కూడా నేరుగా కాకుండా.. ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా.. పంపించాలని కోరడం గమనార్హం. అయితే.. అసలు సర్పంచులకు నెలంతా కష్టపడితే ఇచ్చే గౌరవ వేతనమే రూ.5000 ఉంటుంది. మరి అలాంటి సర్పంచులు.. రూ.5000 ఇవ్వాలంటే.. సాధ్యమేనా? అసలు ఎమ్మెల్యే ఇంట్లో పెళ్లికి సర్పంచులు ఇవ్వడం ఏంటి? అనే ప్రశ్నలు హల్చల్ చేస్తున్నాయి.