తప్పుగా మాట్లాడితే సారీ చెప్పటం తప్పేం కాదు. కానీ.. ఎవరో ఒక నేత మరో నేతను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేసినప్పుడు.. దానికి పార్టీ అధినేత బాధ్యత వహించి సారీ చెప్పాలని పార్టీ నేత కోరితే.. ఫలితం ఎలా ఉంటుంది? కానీ.. రోటీన్ కు భిన్నంగా.. అందరిని కలుపుకుపోవటమే తప్పించి.. తల ఎగరేయటం తనకు రాదన్న చందంగా వ్యవహరించిన టీపీసీసీ రేవంత్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెర తీశారని చెప్పాలి.
ఇంతకాలం తాము చేసిన తప్పులకు సైతం సారీ చెప్పేందుకు ఇష్టపడని నేతలకు భిన్నంగా.. తాను నాయకుడి స్థానంలో ఉన్నప్పటికీ.. పార్టీకి చెందిన నేత ఒకరు చేసిన తప్పునకు భేషరతుగా క్షమాపణ చెప్పారు రేవంత్. అసలేం జరిగిందంటే.. చుండూరులో జరిగిన సభలో పార్టీకి చెందిన అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన కోమటిరెడ్డి.. తనకు టీ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి భేషరతు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎవరో అన్న మాటలకు రేవంత్ ను సారీ అడిగితే.. ఆయన స్పందిస్తారా? అన్న సందేహం వ్యక్తమైంది. అందుకు బదులుగా.. ఎవరూ ఊహించని రీతిలో రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలోఒక వీడియో పోస్టు చేశారు. అందులో తాను భేషరతు క్షమాపణలు చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే తనకు గౌరవం ఉందని.. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు.
చుండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన ఘాటు విమర్శలకు కోమటిరెడ్డి కోరినట్లుగా తాను భేషరతు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. దయాకర్ మీద తదుపరి చర్యలకు విషయాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డికి తెలియజేస్తానని పేర్కొన్నారు. పార్టీలో ఎవరు క్రమశిక్షణ తప్పినా వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన దయాకర్ పై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రేవంత్ భేషరతుగా క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates