గోరంట్ల రచ్చ.. సజ్జల ప్రెస్ మీట్

గడిచిన మూడు నాలుగు రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన అశ్లీల.. జగుప్సాకరన వీడియోకు సంబంధించిన రచ్చ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అతడిపైన చర్యలు తీసుకోవాలని.. శిక్షించాలన్న డిమాండ్ల వేళ.. అందుకు భిన్నమైన రీతిలో రియాక్షన్ వెలువడింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా వ్యవహరించే సజ్జల రామక్రిష్ణారెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. ఇందులో పలు అంశాల్ని ఆయన ప్రస్తావించారు. అవేమిటన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

–  తాను ప్రజల్లో మనిషి కాదనే విషయం చంద్రబాబు నాయుడుకు తెలుసని, అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు. 2019లో ఘోరంగా ఓటమి పాలై వెంటిలేటర్‌ మీదకు చేరుకున్న పార్టీ టీడీపీ. ఈ మూడేళ్లలో వచ్చిన ప్రతీ ఎన్నికలోనూ టీడీపీ ఘోర పరాభవం చూసింది.
–  టీడీపీ నాయకులు నిద్రలో మళ్లీ తామే వస్తున్నామని అంటూ కలవరింతలు పలుకుతున్నారు. వారికి వారు కార్యకర్తల్లో నిరాశను తొలగించడానికి సెల్ఫ్‌ హిప్నాటిజం చేసుకుంటున్నారు.
–  కాకమ్మ కథలతో కాస్త భ్రమ కలిగించవచ్చు కానీ ఫలితం ఉండదు. ఎన్నికల తర్వాత చంద్రబాబు పిల్లి మొగ్గల్లో ఏమాత్రం తేడా రాలేదు. తనని రిజెక్ట్ చేసి మూడేళ్ళయ్యింది…ఆ విషయం ఆయనకు గుర్తుకు రావడం లేదు. ఇప్పటికీ ఆ వాయిస్‌పై క్లారిటీ రాలేదు.
–  2015లో ఒక ఎమ్మెల్సీ కోసం చంద్రబాబు నాయుడు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే.. ఆ వాయిస్‌ తనది కాదని బాబు చెప్పారు.
–  ఢిల్లీ వెళ్లి చంద్రబాబు ఏదేదో ప్రచారం చేస్తున్నారు.ప్రధాని మోదీనే ఈయనను పిలిచినట్లు కలరింగ్‌ ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఊతకర్ర కోసం చూస్తున్నారు.ఏపీలో బీజేపీ సహకారం కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది.
–  నాయకుడు ఎలా ఉండకూడదో చంద్రబాబుకి చూపారు..ఎలా ఉండాలో జగన్‌ చూపించారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనల నుంచి వచ్చిన పార్టీ మాది. చంద్రబాబు మొదటి నుంచీ ఎవరో ఒకరితో పోయాడు. నేను ప్రజల్లో మనిషిని కాదని చంద్రబాబుకి తెలుసు. ప్రజలకు ఏమి కావాలో సీఎం జగన్‌కు తెలుసు.
–  ఓటుకు నోటు కేసులో చంద్రబాబుది ఒరిజినల్‌ వాయిస్‌ కాదా? ఏడేళ్లైనా ఓటుకు నోటు కేసులో బాబు వాయిస్‌పై క్లారిటీ లేదు. కానీ చంద్రబాబు వాయిస్‌ ఎన్నికల వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసేలా ఉంది. అలాంటి వాడు సీఎంగా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చేశారు కదా.
–  రాత్రికి రాత్రి పారిపోయి వచ్చిన చరిత్ర అందరికీ తెలుసు. బ్రీఫ్‌డ్‌ మీ అన్నది చంద్రబాబుది కాదా? 2015లో ఒక ఎమ్మెల్సీ కోసం చంద్రబాబు నాయుడు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే.. ఆ వాయిస్‌ తనది కాదని బాబు చెప్పారు. ఇప్పటికి ఆ వాయిస్ పై క్లారిటీ లేదు.
–  ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించి అది మార్ఫింగ్‌ వీడియో కాదని తేలితే తప్పక చర్యలుంటాయి. దీనిపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.