ఆ 59 యాప్స్‌పై నిషేధం.. 45 వేల కోట్ల నష్టం?

ఇండియాలో చైనా ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లను ఆపితే ఆ దేశానికి నష్టం కానీ.. చైనా యాప్‌లను నిషేధిస్తే వచ్చే నష్టమేంటి అన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. కానీ యాప్‌ల ద్వారా వచ్చే ఆదాయం గురించి తక్కువ అంచనా వేస్తే తప్పే అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ యాప్‌గా ఉన్న టిక్ టాక్‌తో పాటు మరో పాపులర్ యాప్ ‘హలో’.. ఇంకొన్ని చైనా యాప్‌ల యాజమాన్య సంస్థ ‘బైట్ డ్యాన్స్’.. ఈ యాప్‌లను ఇండియాలో నిషేధించడం వల్ల ఏకంగా 6 బిలియన్ డాలర్లు.. అంటే రూపాయల్లో చెప్పాలంటే 45 వేల కోట్ల పైగానే నష్టపోనుందట.

ఒక్క మే నెలలోనే ‘టిక్ టాక్’ యాప్‌ను 11 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులో మెజారిటీ డౌన్ లోడ్లు ఇండియాలోనే జరిగాయి. దీన్ని బట్టి దేశంలో ఆ యాప్ ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వేల కోట్ల ఆదాయం పొందుతోంది బైట్ డ్యాన్స్.

ఆ సంస్థ మరిన్ని యాప్‌లను లాంచ్ చేయడానికి, ఉన్న యాప్‌లను వృద్ధి చేసి మరింతగా విస్తరించడానికి భారీగా ప్రణాళికలు రచించుకుంది. ఇందుకోసం బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7500 కోట్లు) దాకా పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధమైంది. భారత ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇప్పుడు వస్తున్న ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు భవిష్యత్తులో రాబట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్న ఆదాయం.. మొత్తం కలిపితే ఆ సంస్థకు నష్టం రూ.45 వేల కోట్ల దాకా ఉంటుందని అంచనా.

కేవలం యాప్‌ల ద్వారా ఇంత ఆదాయం వస్తోందంటే.. ఇక వివిధ రకాల ఉత్పత్తులు, ముడిసరుకు ఎగుమతుల ద్వారా చైనా ఇండియా నుంచి ఎన్ని లక్షల కోట్ల ఆదాయం పొందుతూ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు దేశంలో ఆ దేశానికి చెందిన కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. అనేక రకాలుగా చైనాపై ఆధారపడి ఉండటం వల్ల పూర్తిగా ఆ దేశంతో తెగతెంపులు చేసుకోవడం కష్టం కానీ.. యాప్‌ల నిషేధంతో పాటు పెట్టుబడుల విషయంలో నియంత్రణ పాటిస్తే చైనాను గట్టిగానే దెబ్బ తీసినట్లు అవుతుందన్నది నిపుణుల మాట.