రాయ్‌పూర్ వేదికగా మరోసారి విరాట్ కోహ్లీ బ్యాట్ గర్జించింది. “కోహ్లీ పని అయిపోయింది, వయసు మీద పడింది” అని విమర్శించే వారికి తన బ్యాట్‌తోనే దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఇది విరాట్‌కి రెండో సెంచరీ. కేవలం 93 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేసి, తానింకా రేసుగుర్రాన్నే అని ప్రపంచానికి చాటిచెప్పాడు.
టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పాక, కోహ్లీ వన్డేల నుంచి కూడా తప్పుకుంటాడేమో అనే అనుమానాలు చాలామందిలో ఉండేవి. 2027 వరల్డ్ కప్ వరకు అతను ఫిట్‌గా ఉంటాడా? ఫామ్ కొనసాగిస్తాడా? అనే చర్చలు నడిచాయి. కానీ, ఈ సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాది ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేశాడు. ఫిట్‌నెస్, రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్, షాట్ సెలక్షన్ చూస్తుంటే.. మరో మూడేళ్లు కాదు, ఐదేళ్లయినా ఆడగల సత్తా తనలో ఉందని నిరూపించాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీకి తోడుగా యంగ్ గన్ రుతురాజ్ గైక్వాడ్ (105 పరుగులు) కూడా చెలరేగిపోయాడు. వీరిద్దరూ కలిసి సఫారీ బౌలర్లను ఉతికారేశారు. ముఖ్యంగా సీనియర్, జూనియర్ కలిసి భారీ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పడం మ్యాచ్‌కే హైలైట్. గైక్వాడ్ దూకుడుగా ఆడుతుంటే, కోహ్లీ తన అనుభవంతో ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతం.
ఈ సెంచరీతో కోహ్లీ సచిన్ 100 సెంచరీల రికార్డుకు మరింత చేరువయ్యాడు. కేవలం వన్డేలే ఆడుతున్నా, ఇలా ప్రతి మ్యాచ్‌లో సెంచరీలు కొడితే ఆ మ్యాజికల్ ఫిగర్ చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. కోహ్లీలో ఉన్న కసి చూస్తుంటే, రికార్డుల కోసం కాకపోయినా, టీమిండియాను గెలిపించడమే లక్ష్యంగా ఆడుతున్నట్లు అర్థమవుతోంది.
మొత్తానికి ఈ సిరీస్ కోహ్లీకి ఒక పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్. విమర్శకులు తన కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలని చూసిన ప్రతిసారీ, కామాలు పెట్టి ముందుకు వెళ్లడం కింగ్ కోహ్లీ స్టైల్. ఈ ఫామ్ చూస్తుంటే 2027 వరల్డ్ కప్‌లోనూ టీమిండియాకు ఆయనే ప్రధాన అస్త్రం కాబోతున్నాడని, కప్పు కొట్టేదాకా తగ్గేదేలే అని స్పష్టంగా సంకేతాలు పంపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates