పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ, అది చిన్న నేరమే..దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుంది…పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఎవరైనా అంటే అది కచ్చితంగా తప్పే. ఇక, అటువంటి మాటలు సాక్ష్యాత్తూ ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నోటి నుంచి వస్తే అది ఇంకా పెద్ద తప్పు. అటువంటి తప్పునే ఏపీ మాజీ సీఎం జగన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పరకామణి చోరీ వ్యవహారం చాలా చిన్నదని ఆ దొంగతనాన్ని గ్లోరిఫై చేస్తూ జగన్ చేసిన కామెంట్లు షాకింగ్ గా మారాయి.

దానికి ప్రాయశ్చిత్తంగా సదరు దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్ల విలువైన ఆస్తులు ఆలయానికి విరాళంగా ఇచ్చారని, అది తప్పెలా అవుతుందని జగన్ అడిగిన లాజిక్ లేని ప్రశ్నపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 72 వేల రూపాయల విలువైన 9 డాలర్ నోట్లను మాత్రమే చోరీ చేశారని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. ఇదో ఆశ్చర్యం కలిగించే కేసు అని, ఆ దొంగను పట్టుకోవడం నేరమవుతుందా? అని జగన్ ప్రశ్నించడం ఏంటని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. పైగా, చాలా ఆలయాల్లో ఇటువంటి చోరీలు జరిగాయని, అక్కడ చోరీ చేసిన దొంగలు ప్రాయశ్చిత్త విరాళాలివ్వలేదని జగన్ చెప్పడంతో కొందరికి మైండ్ బ్లాక్ అయిందట. దీంతో పరకామణి దొంగను జగన్ వెనకేసుకొస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడంలో తప్పు లేదని, కానీ, దేవుడి విషయంలో ఇటువంటి వెటకారపు మాటలు మాట్లాడడం సరికాదని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ స్థాయికి ఈ వ్యాఖ్యలు తగవని, పవిత్రమైన దేవాలయంలో జరిగినా…ఇంకో చోట జరిగినా చోరీ చోరీనే అని చురకలంటిస్తున్నారు. మాజీ సీఎం అయిన జగన్ చేసిన ఈ తరహా వ్యాఖ్యలు సమాజానికి తప్పుడు సందేశాన్నిస్తాయని, ఆయన మాటలు దొంగలకు మద్దతిచ్చినట్లే ఉన్నాయని అంటున్నారు.