‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి వైసీపీని మట్టి కరిపించాయి. కూటమిలోని మూడు పార్టీల మధ్య చిన్న చిన్న సమస్యలుండడం సహజం. కానీ, ఆ చిన్న సమస్యలను భూతద్దంలో చూపించి కూటమిని విచ్ఛిన్నం చేయాలని వైసీపీ ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే కూటమి పార్టీల నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచన చేశారు. కూటమి బలంగా ఉండాలంటే మూడు పార్టీల నేతలు మినీ యుద్ధాలే చేయాలని పవన్ అన్నారు.

విభిన్నమైన పార్టీల నుంచి వచ్చిన నేతలు, కానీ, రాష్ట్రం బాగుండాలని, అరాచక పాలన ఉండకూడదన్నది అన్ని పార్టీల ఉమ్మడి ఉద్దేశ్యమని పవన్ చెప్పారు. ఒక పార్టీకి చెందిన నాయకులలోనే అంతర్గత విభేదాలుండడం సహజమని, అటువంటిది మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడితే పార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలుంటాయని అన్నారు. అయితే, సామరస్యపూర్వకంగా కూర్చొని మాట్లాడుకొని చిన్న చిన్న గొడవలు, సమస్యలను పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

చైనా, ఇండియాల మధ్య చర్చలు ఒక్కోసారి 18-20 సార్లు కూర్చుంటేగానీ పరిష్కారం కావని, అదే రీతిలో కూటమి పార్టీలు కలిసికట్టుగా బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలే చేయాల్సి ఉంటుందని పవన్ అన్నారు. యుద్ధం అంటే గొడవ కాదని, మాట్లాడుకొని, చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని పవన్ సూచించారు. బలాబలాలు చూసుకోవాలని, పరిస్థితులను గమనించుకోవాలని అన్నారు.

కూటమి పార్టీలోని చిన్న చిన్న విభేదాలను పెద్దవి చేసి కూటమిని విడగొట్టేందుకు వైసీపీ రెడీగా ఉందని, ఆ అవకాశం వైసీపీకి ఇవ్వకుండా కూటమి లోని అంతర్గత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పవన్ సూచించారు. అంతేగానీ, సోషల్ మీడియాలో ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేయడం ద్వారా వైసీపీకి పలుచన అయిపోతామని పవన్ అంటున్నారు.