‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్ ఉన్న సంగతి తెలిసిందే. జగన్ జనంలోకి వస్తున్నారంటే చాలు చెట్లు నరకడం, పరదాలు కట్టడం వంటి విషయాలు అధికారులకు ఒక బిగ్ టాస్క్ గా మాదిరి ఉండేది. అయితే, ఆ విషయాన్ని వైసీపీ నేతలు, వైసీపీ అనుకూల మీడియా మరిచిపోయినట్లు కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను పరదాలు కట్టుకొని జనంలోకి వస్తున్నారంటూ వైసీపీ మీడియా విమర్శిస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా జనంతో మమేకమైన జనసేనాని వారి నుంచి వినతులను స్వయంగా తీసుకుంటున్న ఫొటోతో వైసీపీ మీడియాకు జనసేన కౌంటర్ ఇచ్చింది. దీంతో, పరదాల్లో పవన్ అంటూ విమర్శిస్తున్న వైసీపీ మీడియా ఇప్పుడేం అంటుందోనని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి పవన్ ఎప్పుడూ ప్రజల మనిషే. ప్రజలతో కలిసిపోయి వారితోపాటు పవన్ కింద కూర్చున్న సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

అటువంటి పవన్ ను వైసీపీ మీడియా విమర్శించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. పంట నష్టపోయిన రైతులను బారికేడ్లు పెట్టుకొని గ్రీన్ మ్యాట్ పై నడుచుకుంటూ వెళ్లి పరామర్శించిన జగన్ కు హితవు చెప్పుకోవాలని వైసీపీ నేతలకు జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారు.