అఖండ ప్లానింగ్… అక్క‌డ సూప‌ర్… కానీ ఇక్క‌డ‌?

పెద్ద సినిమాల‌కు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆల‌స్యం కావ‌డం ఇటీవ‌ల పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డం, అద‌న‌పు రేట్ల కోసం జీవోలు తెచ్చుకోవ‌డంలో స‌రైన ప్లానింగ్ లేక‌పోవ‌డం వ‌ల్ల రిలీజ్ ముంగిట గంద‌ర‌గోళ ప‌రిస్థితులు త‌లెత్తి తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి. విడుద‌ల‌కు రెండు రోజుల ముందు కూడా జీవో రాక అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాని సినిమాలు చాలానే ఉన్నాయి. అద‌న‌పు రేట్ల వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఎంతో కానీ.. బుకింగ్స్ ఆల‌స్యం వ‌ల్ల జ‌రిగే న‌ష్టం బాగానే ఉంటోంది. 

మ‌రోవైపు విదేశాల‌కు స‌రైన స‌మ‌యంలో కంటెంట్ పంప‌క‌పోవ‌డం వ‌ల్ల అక్క‌డ ప్రిమియ‌ర్స్ మీద ప్ర‌భావం ప‌డుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఓజీ విష‌యంలో ఈ ఇబ్బంది బాగా క‌నిపించింది. కెన‌డా స‌హా ప‌లు చోట్ల షోలు క్యాన్సిల్ అయి న‌ష్టం వాటిల్లింది. ఐతే టాలీవుడ్ లేటెస్ట్ బిగ్ మూవీ అఖండ‌-2 విష‌యంలో ఓవ‌ర్సీస్ కంటెంట్ డెలివ‌రీ విష‌యంలో ఏ ఇబ్బంది లేక‌పోయింది. విడుద‌ల‌కు నాలుగు రోజుల ముందే అన్ని చోట్ల‌కు కేడీఎంలు డెలివ‌ర్ అయిపోయాయి. ఈ విష‌యంలో ప‌క్కా ప్లానింగ్‌తో ఉన్నారంటూ అఖండ మేక‌ర్స్ మీద ప్ర‌శంస‌లు కురిశాయి.

కానీ అద‌న‌పు షోలు, రేట్ల‌కు ముందు జీవోలు తెప్పించుకోవ‌డంలో మాత్రం టీం స‌క్సెస్ కాలేక‌పోయింది. ఏపీ జీవో మూడు రోజుల ముందు వ‌చ్చింది. వెంట‌నే బుకింగ్స్ మొద‌లైపోయాయి. మంచి ఊపుతో టికెట్లు అమ్ముడ‌వుతున్నాయి. కానీ తెలంగాణ‌లో మాత్రం రిలీజ్‌కు రెండు రోజుల ముందు కూడా జీవో రాలేదు. గురువారం రాత్రి సెకండ్ షోకు పెయిడ్ ప్రిమియ‌ర్స్ వేసేందుకు ఇక్క‌డ థియేట‌ర్లు రెడీగా ఉన్నాయి. అభిమానులు కూడా టికెట్ల కోసం ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. 

బుధ‌వారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు వెయిట్ చేసి చేసి అల‌సిపోయారు. నిర్మాత రామ్ ఆచంట సాయంత్రం 5-6 మ‌ధ్య బుకింగ్స్ మొద‌ల‌వుతాయ‌ని చెప్పారు. కానీ అలా ఏమీ జ‌ర‌గేలుద‌. రాత్రి 8 గంట‌ల‌కు కూడా బుకింగ్స్ మొద‌లు కాలేదు. ఇక‌పై జీవో వ‌చ్చినా స‌రే.. ఇంత ఆల‌స్యం కావ‌డం వ‌ల్ల బుకింగ్స్ మీద నెగెటివ్ ఇంపాక్ట్ బాగా ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. అద‌న‌పు షోలు, ధ‌ర‌ల కోసం కాస్త ముందుగా ద‌ర‌ఖాస్తు చేసి, త్వ‌ర‌గా జీవో వ‌చ్చేలా చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల న‌ష్టం ఎక్కువ‌గానే ఉంటోంది. దీనిపై నిర్మాత‌లు ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టాల్సిందే.