ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం పార్లమెంటు టికెట్ కోసం.. టీడీపీలో కొన్ని రోజులుగా వివాదం రగులుతోంది. ఈ టికెట్ కోసం.. నిన్న మొన్నటివరకు ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదం రేగగా.. ఇప్పడు మరో నాయకుడు కూడా రెడీ అయ్యారు. దీంతో ఒక్క సీటు కోసం.. ముగ్గురు నాయకులు పోటీ పడుతున్న ‘దృశ్యం’ కళ్లకు కడుతోంది. వాస్తవానికి గత ఏడాది వరకు కూడా ఒక్కరే పోటీ లో ఉన్నారు. కానీ, ఇక్కడ ఇప్పుడు రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి.
అయితే.. ఆయనకు పార్టీ అధిష్టానానికి మధ్య గ్యాప్ పెరిగింది. దీనికితోడు.. మరొకొరు .. తనకు ఎమ్మెల్యే సీటు రాదని తెలిసి.. ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదిలావుంటే.. తాను ఎట్టి పరిస్థితిలోనూ.. గెలిచి తీరుతానని.. మరొకరు ముందుకు వచ్చారు. దీంతో టీడీపీలో్ హిందూపురం ఎంపీ టికెట్ హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వరుసగా నిమ్మల కిష్టప్ప.. ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్నారు.
2009, 2014లోనూ ఆయన హిందూపురం ఎంపీగా విజయం సాధించారు. అయితే.. గత ఎన్నికల్లో సీఐ.. గా ఉండి.. తర్వాత వైసీపీలో చేరిన గోరంట్ల మాధవ్ విజయం దక్కించుకున్నారు. దీంతో.. ఇక్కడ టీడీపీ పలచన అయింది. పైగా.. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాల్సిన కిష్టప్ప.. అనారోగ్య సమస్యల తో పార్టీకి దూరంగా ఉన్నారు. మహానాడుకు కానీ.. ఇతరత్రా ఏ కార్యక్రమానికీ ఆయన హాజరు కాలేదు. దీంతో అధిష్టానం ఆయనను పక్కన పెట్టే ఆలోచనతో ఉందని సమాచారం.
ఇదే సమయంలో తనకు ఎమ్మెల్యే ఛాన్స్ లేదని భావించిన బీకే పార్థసారథి.. హిందూపురం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆయనకు అంత సత్తా ఉందా లేదా.. అనేది నిర్ధారించాల్సి ఉంటుందని తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. నారా లోకేష్ అనంతకు ఎప్పుడు వచ్చినా.. దగ్గరుండి మరీ.. అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్న వాల్మీకి వర్గానికి చెందిన నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ ఈ టికెట్ కోసం.. గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
అవసరమైతే.. వంద కోట్లు అయినా.. ఖర్చు చేస్తానని.. ఆయన లీకులు ఇస్తున్నారట. అదేసమయంలో వైసీపీ నాయకులతోనూ ఆయన టచ్‌లో ఉండి.. ఎన్నికల సమయానికి వారిని పార్టీ నుంచి జంప్ చేసేలా.. వ్యూహాత్మకంగ ముందుకు సాగుతున్నారని టీడీపీలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా.. హిందూపురం ఎంపీ టికెట్‌పై మాత్రం త్రిముఖ పోరు నెలకొనడం ఆసక్తిగా మారింది.