గడపగడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహణపై జగన్మోహన్ రెడ్డి జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్లతో సమీక్షించారు. కార్యక్రమం జరుగుతున్న తీరుతెన్నులపై అందరితో మాట్లాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో వాళ్ళకున్న బాధ్యతలు ఏమిటి ? వాళ్ళపై తాను ఎలాంటి భారాన్ని మోపారనే విషయాన్ని జగన్ వివరించారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయటంలో జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్ల పాత్రపై జగన్ స్పష్టత ఇచ్చారు.
పనిలోపనిగా ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. అదేమిటంటే ఆగష్టు 4వ తేదీనుండి ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో తాను సమావేశం అవబోతున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలను ఎంపికచేసి క్షేత్రస్ధాయిలో పార్టీ, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఏమిటో తెలుసుకుంటానని చెప్పారు. అలాగే పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను, వాటి పరిష్కారాలను, ఎంఎల్ఏల పనితీరు తదితరాల ఫీడ్ బ్యాంక్ కోసమే డైరెక్టుగా కార్యకర్తలతో సామవేశం అవుతున్నట్లు చెప్పారు.
ఆగష్టు నుండి మొదలయ్యే కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను తొందరలోనే ఒక ప్రకటన చేయబోతున్నట్లు కూడా చెప్పారు. కార్యకర్తలతో జగన్ సమావేశం అవటం లేదనే ఆరోపణలు, అసంతృప్తి చాలామందిలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజాప్రతినిధులు, నేతల, కార్యకర్తలను కలిసినట్లుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవటం సాధ్యం కాదన్నది వాస్తవం. అయితే నేతలు, కార్యకర్తలను పూర్తిగా విస్మరిస్తే జరిగే పరిణామాలు ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
ఏ పార్టీకి అయినా కార్యకర్తలే ఆయువుపట్టు. పార్టీ జెండాలు మోసేది, బ్యానర్లు కట్టేది అవసరమైతే ప్రత్యర్ధి పార్టీలతో కలబడేది కూడా కార్యకర్తలే. కొంపాగోడు అంతా వదిలిపెట్టి పార్టీకోసం పనిచేసేది వాళ్ళే కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత తమను సీఎం గుర్తించాలని వాళ్ళు అనుకోవటంలో తప్పే లేదు. కాకపోతే అందరినీ కలవటం ఏ ముఖ్యమంత్రికీ సాధ్యం కాదు. అయితే వీలైనంతలో ఏదో పద్దతిలో ఎంతమందిని వీలైతే అంతమందిని సాటిస్ఫై చేస్తే అసంతృప్తి కొంతలో కొంతైనా తగ్గుతుంది. ఇందుకనే వచ్చే నెల నుండి ముఖాముఖి కార్యక్రమాలు పెట్టుకున్నది.