వైసీపీ ఎమ్మెల్యేలపై కనక వర్షం కురవనుంది. స్వయంగా సీఎం జగన్ ఈ విషయాన్ని చెప్పారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు సహా ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజల ఆశీస్సులు తిరిగి పొందేలా ప్రయత్నాలు చేయాలని ఎమ్మెల్యేలను సీఎం కోరారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు చేపట్టకపోవడం.. తూతూ మంత్రంగా తిరుగుతున్న వారి పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని సూచించిన సీఎం.. పార్టీకి నష్టం కల్గితే తానేం చేయలేనని.. గెలిచేవారికే టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్క్‌షాప్ నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ చార్జీలు, సమన్వయకర్తలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
గడపగడపలో ఎమ్మెల్యేలు పాల్గొనడం సహా జరుగుతున్న తీరుపై పార్టీ చేయించిన సర్వే నివేదికలను సీఎం వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేల వారీగా పనితీరును తెలియజేశారు. ఇప్పటివరకు మాజీ మంత్రి ఆళ్లనాని, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు కేవలం 10 రోజులు మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించడం, కొందరు తూతూ మంత్రంగా గ్రామాల్లో పర్యటించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని లేనిపక్షంలో.. గ్రాఫ్ మెరుగుపరచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు.
“నేను చేయాల్సింది అంతా చేస్తున్నా, ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలి. సంక్షేమ పథకాలను సకాలంలో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం, దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఎమ్మెల్యేల బాధ్యత. ఎమ్మెల్యేలు చేయాల్సింది చేస్తేనే ఫలితాలు సాధిస్తాం.. ఇద్దరమూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతాం. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్) నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయింపు చేస్తాం. గడప, గడపకూ కార్యక్రమంలో భాగంగా రానున్న నెలరోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలి. వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు.. గరిష్టంగా 21రోజులు గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి” అని జగన్ నిర్దేశించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates