ఏపీ బీజేపీ నోటికి తాళం

రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌కు పెద్ద స‌మ‌స్య వ‌చ్చింది. ఏ గ‌ట్టునుండాలో తెలియ‌క నాయ‌కులు స‌త‌మ‌తం అవుతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌ల‌ను, మంత్రులను.. వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఇష్టానుసారం గా విమ‌ర్శించిన‌.. బీజేపీ రాష్ట్ర నేత‌ల‌కు ఇప్పుడు ఒక్క‌సారిగా పాలుపోని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రోవైపు.. టీడీపీ విష‌యంలోనూ నాయ‌కులు ఏం చేయాల‌నే విష‌యంపై త‌ర్జ‌న భర్జ‌న ప‌డుతున్నారు. వైసీపీని విమ‌ర్శిస్తున్న క్ర‌మంలోనే త‌ర‌చుగా.. టీడీపీపైనా బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు.. వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులు తినేశార‌ని.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం కూడా ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డం లేద‌ని.. కేంద్రం ఇస్తున్న నిధులు తీసుకుని.. పేద‌ల‌కు ఇవ్వ‌డం లేద‌ని.. వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంద‌ని.. వైసీపీ, టీడీపీల‌కు తామే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని.. నాయ‌కులు చెప్పుకొచ్చా రు. అయితే.. ఇప్పుడు ఇదే నాయ‌కుల‌కు పెద్ద స‌మ‌స్య వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ, టీడీపీల‌ను క‌ట్ట‌గ‌ట్టుకుని విమ‌ర్శించిన బీజేపీ నేత‌ల నోళ్ల‌కు కేంద్రం తాళం వేసింది.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించి బీజేపీ ఎంపిక చేసిన ద్రౌప‌ది ముర్ముకు.. వైసీపీ. టీడీపీలు రెండు కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌కు ఒక్క‌సారిగా షాక్ ఇచ్చిన‌ట్టు అయింది.ప్ర‌స్తుతం ముర్ము గెలుపును.. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వం.. అందివ‌చ్చిన పార్టీల‌తో ఆమెను గెలిపించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో వైసీపీ మ‌ద్ద‌తు ముందు నుంచి ఉండ‌డంతో బీజేపీ రాష్ట్ర నేత‌లు.. కొన్నాళ్లుగా మౌనంగా ఉన్నారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా వైసీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన‌.. బీజేపీ నాయ‌కులు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో దూకుడు త‌గ్గించారు. అయితే.. ఇప్పుడు టీడీపీ కూడా బీజేపీ అభ్య‌ర్థికే.. మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో.. బీజేపీ నేత‌ల‌కు ఊపిరి ఆడ‌డం లేదు. ఇప్పుడు ఈ రెండుపార్టీల‌ను విమ‌ర్శించే ప‌రిస్థితి లేదు. పైగా.. పైనుంచి కూడా స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఉన్నాయి. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇచ్చే పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని.. అన్ని రాష్ట్రాల్లోని బీజేపీ నాయ‌కుల‌కు జాతీయ నాయ‌క‌త్వం.. స‌ల‌హాలు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో ఏపీలో బీజేపీ నాయ‌కులు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. ఇలా అయితే.. ఎలా? ఏం చేయాల‌ని చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.