విషయం పాతదే అయినా చెప్పటమే కొత్తగా చెప్పాలని జనసేన ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని రోడ్ల పరిస్దితిపై జనసేన ఈనెల 15, 16, 17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ప్రచారం చేయబోతున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ డిజిటల్ ప్రచారానికి ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ అనే హ్యాష్ ట్యాగ్ లైన్ తో నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.
రాష్ట్రంలోని గ్రామాల్లో రోడ్ల దుస్ధితిని ఫొటోలు, విజువల్స్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలని అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారట. గతంలో కూడా రోడ్ల పరిస్ధితిపై కొద్దిరోజులు జనసేన నేతలు, కార్యకర్తలు నానా హడావుడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. పాడైపోయిన రోడ్లను మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని అప్పట్లో జనసేన టేకప్ చేసింది. పవన్ స్వయంగా కాకినాడలోని ఒక రోడ్డు గుంతను పూడ్చేందుకు వెళ్ళారు. అయితే వివిధ కారణాల వల్ల నిరసనలో పవన్ పాల్గొనలేకపోయారు.
ఇదే సమయంలో కొందరు జనసేన నేతలు, కార్యకర్తల అత్యుత్సాహం వల్ల అప్పటి నిరసన కార్యక్రమం పెద్దగా వర్కవుట్ కాలేదు. దీనికి కారణం వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడమే. అప్పట్లో కూడా వర్షాకాలంలోనే జనసేన టేకప్ చేసింది.
మళ్ళీ ఇంతకాలానికి సేమ్ వర్షాకాలంలోనే జనసేన కొత్త పద్దతిలో గుడ్ మార్నింగ్ సీఎం సర్ అనే హ్యాష్ ట్యాగ్ లైన్ తో డిజిటల్ రూపంలో నిరసన చెప్పబోతోంది. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే రోడ్లు మరింతగా డామేజ్ అయ్యాయి. కొన్ని పనులు చేసినా అయితే ఇంకా పనులు మొదలుకాని గ్రామాలు చాలానే ఉన్నాయి. మరీ కొత్త పద్దతి డిజిటల్ నిరసన ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates