అధ్యక్ష ఎన్నికల్లో ఓడుతున్నానంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఊహించని రీతిలో విషయాల మీద మాట్లాడటం అందరికి చేతనయ్యే వ్యవహారం కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇందుకు మినహాయింపు. పూటకో సంచలనం.. రోజుకో వివాదం అన్నట్లుగా ఆయన పాలన సాగుతోంది. మరికొద్ది నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. తన ప్రధాన అస్త్రమైన భావోద్వేగంతో పాటు.. అన్నింట్లోనూ అమెరికన్లకే పెద్దపీట అంటూ అగ్రరాజ్యానికి ఉండకూడని అవలక్షణాన్ని అంటకట్టిన అధినేతకు ఆయన్ను పలువురు తప్పు పడతారు. అలాంటి ట్రంప్.. త్వరలో జరిగే ఎన్నికల్లో తాను ఓడిపోతున్నట్లు చెప్పి సంచలనంగా మారారు.

అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఏ రీతిలో ఉండనున్నాయన్న విషయాన్ని చెప్పిన ఆయన.. తన ఓటమి తప్పదని తేల్చారు. వాస్తవానికి ఎన్నికల బరిలో ఉండే ఎవరు చేయని పనిని ట్రంప్ చేశారని చెప్పాలి. కాకుంటే.. ఇందులోనూ వ్యూహం ఉంది. తనను ఓడించాలని డిసైడైన ప్రజలు ఎలాంటి అసమర్థుడ్ని ఎన్నుకోవాలనుకుంటున్నారో మీకు తెలుసా? అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

వచ్చే ఎన్నికల్లో మాట్లాడటం కూడా రాని జో బిడెన్ ఈసారి అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారు. అతను మంచోడా కాదా అనేది అనవసరం.. కానీ అలాంటి వ్యక్తి అధ్యక్షుడిగా పనికి రాదు. నేను ఇప్పటివరకూ ఎంతో చేశా. కొందరికి మాత్రం నేను నచ్చటం లేదు’’ అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. నవంబరు మూడున జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తథ్యమన్న రీతిలో ఇప్పటికే పలు సర్వేలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందించారు.

సర్వేల లెక్క ప్రకారం ట్రంప్ కు కేవలం 40 శాతం మంది మాత్రమే మద్దతు ఇస్తుంటే.. ఆయన ప్రత్యర్థి బిడెన్ కు 55 శాతం మంది మద్దతు ఇవ్వటాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా తన ఓటమిని ఓపెన్ గా చేప్పే తీరు ఎంతమంది అభ్యర్థులకు ఉంటుందో చెప్పండి. ఏమైనా.. ట్రంప్ రోటీన్ కు భిన్నమని చెప్పక తప్పదు.