మోడీ జగన్ ఒకే హెలికాప్టర్లో

ప్రధానమంత్రి నరేంద్రమోడి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకే హెలికాప్టర్లో ప్రయాణం చేయబోతున్నారు. గన్నవరం నుండి భీమవరానికి 4వ తేదీ ఉదయం వీళ్ళద్దరు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తారు. మోడితో కలిసి జగన్ హెలికాప్టర్లో ప్రయాణం చేయటం బహుశా ఇదే మొదటిసారేమో. మోడీ విజయవాడకు వచ్చినా లేదా తిరుపతి పుణ్యక్షేత్రానికి వచ్చినా విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవటం మామూలే.

అయితే ఒకచోట నుండి మరోచోటికి హెలికాప్టర్లో మోడితో జగన్ ప్రయాణంచేసినట్లు లేదు. కాకపోతే వీళ్ళతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉంటారు. నాలుగో తేదీ ఉదయం సుమారు 10 గంటలకు మోడి హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం లాంజ్ లోనే బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు. తర్వాత అక్కడి నుండి భీమవరం వెళతారు. అక్కడ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

తర్వాత అక్కడే జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. సుమారు 50 నిముషాలు బహిరంగసభలో ప్రసంగించే అవకాశముంది. మోడీ తర్వాత జగన్, కిషన్ కూడా మాట్లాడే అవకాశముంది. తర్వాత కొంతసేపు అక్కడే ఉండి అక్కడినుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. మళ్ళీ ఇక్కడ కీలకనేతలతో భేటీ తర్వాత అక్కడి నుండి హైదరాబాద్ కు చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయంలోనే మోడీకి జగన్ వీడ్కోల్ చెప్పేస్తారు.

గన్నవరం-భీమవరం మధ్య సుమారు 20 నిముషాలు ప్రయాణం ఉండచ్చు. మరీ 20 నిముషాల సమయాన్ని జగన్ ఏ విధంగా ఉపయోగించుకుంటారనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. కేంద్రం నెరవేర్చాల్సిన రాష్ట్రప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇదే సమయంలో ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రాజకీయంగా తాను బలపడేందుకు జగన్ ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా తాను రాజకీయంగా బలపడేందుకే కాకుండా రాష్ట్రప్రయోజనాలు నెరవేరేందుకు కూడా జగన్ 20 నిముషాల సమయాన్ని ఉపయోగించుకుంటే సంతోషమే.