అవంతికి భయం పట్టుకుందా?

ఆయ‌న మాజీ మంత్రి. మంచి మాట కారి కూడా. పైగా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. అయితే ఏం.. ఇప్పుడు ఆయ‌నకు భ‌యం ప‌ట్టుకుంద‌ని అంటున్నారు. ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇది నిజం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ను గెలుస్తానో లేదో.. అని ఆయ‌న తెగ మ‌ధ‌న ప‌డుతున్నార‌ట‌. ఈ విష‌యం సొంత అనుచ‌రుల్లోనే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు.. మాజీ మంత్రి.. వైసీపీ నాయ‌కుడు.. భీమిలి ఎమ్మెల్యే.. అవంతి శ్రీనివాస‌రావు.

గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హించిన ఆయ‌న 2019 ఎన్నిక‌లకు ముందు.. వైసీపీలో చేరి.. ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. మంత్రి కూడా అయ్యారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు రెండు ర‌కాలుగా ఆయ‌న‌కు ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు. ఒక‌టి పార్టీ ప‌రంగా ఆయ‌న ఒంటరి అయ్యార‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌లో విజ‌య‌సాయిరెడ్డి హ‌వా త‌గ్గినా.. ఆయ‌న అనుచ‌రుల రాజ‌కీయాలు పెరిగిపోయాయి.

ఆదినుంచి కూడా సాయిరెడ్డికి.. అవంతికి మ‌ధ్య విభేదాలు ఉన్నాయి. మంత్రిగా త‌న‌ను స‌రిగా ప‌నిచేయ నీయ‌లేద‌ని.. అందుకే త‌నకు మ‌రోసారి రెన్యువ‌ల్ రాలేద‌ని..అవంతి బాధ‌ప‌డుతున్నారు. దీనికితోడు.. సాయిరెడ్డి అనుచ‌రులు.. ఆయ‌న వ‌ర్గంగా ఉన్న‌వారు కూడా అవంతిని ప‌క్క‌న పెట్టారు. ఇక‌, అధిష్టానం కూడా అవంతిని ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో పార్టీలో ఆయ‌న ఒంట‌రి అయ్యార‌నే టాక్‌వినిపిస్తోంది. దీంతో ఒకింత మాన‌సికంగా ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు.. ప్ర‌జ‌ల్లోనూ అవంతి విష‌యంలో సానుభూతి క‌నిపించ‌డం లేదు. పార్టీలు మార‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం.. ఆయ‌న‌కు స‌మ‌స్య‌గా మారింది. ఎక్క‌డికి వెళ్లినా.. ఇప్ప‌టికీ అవంతిని టీడీపీ నేత‌గానే కొంద‌రు చూస్తున్నారు. అదేస‌మ‌యంలో అభ‌వృద్ధి చేయ‌లేద‌ని కూడా నిల‌దీస్తున్నారు. దీంతో ఆయ‌న రెండు ర‌కాలుగా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న ఫేట్ ఏమ‌వుతుందోన‌ని ఇబ్బంది ప‌డుతున్నార‌ని ఆయ‌న అనుచ‌రులే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.