రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని అనుకుంటున్న వాళ్ళకు కేంద్ర ఎన్నికల కమిషన్ చెక్ పెట్టబోతోంది. వచ్చే ఎన్నికల నుంచి ఒక అభ్యర్ధి ఒక నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయాలనే నిబంధనను మళ్ళీ తెరపైకి తెచ్చింది. ఈ మేరకు చట్టంలో మార్పులు తేవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ సూచించింది. గతంలో కూడా ఇలాంటి నిబంధనను కమిషన్ సిఫారసు చేసినా అప్పట్లో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు.
షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంతకాలం మరుగునపడిన నిబంధన మళ్ళీ ఇపుడు తెరపైకి వచ్చింది. రెండు చోట్ల నుండి పోటీ చేసి గెలిచిన అభ్యర్ధి ఒక నియోజకవర్గానికి రాజీనామా చేస్తారు. అప్పుడు రాజీనామా చేసిన అభ్యర్ధే మొత్తం ఉపఎన్నికల ఖర్చును భరించేందుకు సిద్ధపడితే మాత్రమే రెండుచోట్ల పోటీకి అనుమతివ్వాలనే నిబంధనకు సవరణను కూడా కమీషన్ ప్రతిపాదించింది.
మామూలుగా అయితే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు చాలా తక్కువగా ఉంటారు. అప్పుడెప్పుడో ఎన్టీయార్ మూడు నియోజకవర్గాల్లో తర్వాత రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఆ తర్వాత చాలాకాలానికి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రెండు చోట్ల పోటీ చేశారు. అయితే చిరంజీవి ఒక నియోజకవర్గంలో ఓడిపోయారు కాబట్టి రాజీనామా, ఉపఎన్నిక అవసరంలే రాలేదు. మొన్నటి ఎన్నికలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు.
అయితే పవన్ రెండు చోట్లా ఓడిపోవటంతో అసలు ఎలాంటి సమస్యా తలెత్తలేదు. అయినా వచ్చే ఎన్నికల్లో ఎవరైనా రెండు చోట్లా పోటీ చేసే అవకాశమైతే ఉంది. దాన్ని నివారించేందుకే కేంద్ర ఎన్నికల కమీషన్ ముందు జాగ్రత్తగా నిబంధనల్లో మార్పులు చేయాలని సూచించింది. మార్పులు చేయటం సాధ్యం కాకపోతే కనీసం సవరణ అయినా చేయాలని సూచించింది. ఉపఎన్నిక ఖర్చును మొత్తం రాజీనామా చేసిన సదరు అభ్యర్ధే పెట్టుకోవాలంటే కష్టమే. అందుకనే రెండు నియోజకవర్గాల్లో పోటీకి వెనకాడే అవకాశాలు ఎక్కువగా ఉంది. మరీ నిబంధన, దానికి సవరణలో కేంద్ర ప్రభుత్వం దేన్ని ఎంచుకుంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates