టీఆర్ఎస్ లో పీకే గుబులు

తెలంగాణా ఎన్నికల్లో ముందస్తు ఫీవర్ పెరిగేకొద్దీ టీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే 119 నియోజకవర్గాల్లోను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) బృందం చాలా డీటైల్డ్ గా సర్వేలు చేసిందట. దాని రిపోర్టును కేసీయార్ కు పీకే అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రి కేటీయారే బయటపెట్టారు.

పీకే సర్వే రిపోర్టు ఆధారంగానే రేపటి ఎన్నికల్లో టికెట్లుంటాయని కేటీయార్ పెద్ద బాంబు పేల్చారు. ఎప్పుడైతే సర్వే రిపోర్టు ఆధారంగానే టికెట్ల కేటాయింపని కేటీయార్ చెప్పారో దాదాపు అదే ఖాయమైయిపోయినట్లే. ఇక క్షేత్రస్థాయిలో పరిస్ధితులు చూస్తే చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. అలాగే ఎంఎల్ఏల మధ్య కూడా బాగా వివాదాలు పెరిగిపోతున్నాయి. మంత్రులు, ఎంఎల్ఏలకు కేసీయార్ పూర్తిస్వేచ్చ ఇచ్చిన కారణంగానే అందరు భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు తదితరాల్లో బాగా ఇన్వాల్వయిపోయారనే ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి.

దీంతో తెలంగాణాలో చాలాచోట్ల భూవివాదాలు కిడ్నాపులు, హత్యలు, కేసులు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కేసీయార్ మీద రిఫ్లెక్టవుతోంది. తన రిపోర్టులో పీకే ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఎంతమంది మంత్రులు, ఎంఎల్ఏలు ఎలాంటి వివాదాల్లో ఇరుక్కున్నారు, ఎంతమంది పైన జనాల్లో వ్యతిరేకత ఉందని ఉదాహరణలతో సహా చెప్పారట. అలాగే ఎంఎల్ఏలకు ప్రత్యామ్నాయంగా కొందరి పేర్లు కూడా ప్రస్తావించారట.

ఇక్కడ సమస్య ఏమిటంటే ఎంఎల్ఏకి ప్రత్యామ్నాయంగా కొన్ని పేర్లు ప్రకటిస్తే వాళ్ళపైన కూడా చాలా ఆరోపణలున్నాయట. దాంతో ఎవరికి టికెట్లివ్వాలనే విషయంలో కేసీయార్ పెద్ద కసరత్తు చేయాల్సిందే అని పార్టీవర్గాలే చెబుతున్నాయి. సో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో కొత్త మొహాలే కనిపిస్తాయట. మరి కొత్త మొహాలకే టికెట్లు ఇవ్వాలని కేసీయార్ డిసైడ్ అయితే సిట్టింగులు ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది. చివరకు కేసీయార్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాల్సిందే.