రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంపై జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి పెంచేస్తున్నారు. ఎన్డీయే అభ్యర్ధికి మద్దతివ్వాలంటే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలనే షరతు విధించాలని పలువురు జగన్ కు సూచిస్తున్నారు. ఇలా షరతు విధిస్తేనే మోడి దిగొస్తారని, హోదా సాధనకు జగన్ కు రాష్ట్రపతి ఎన్నిక సువర్ణావకాశమని ఏదేదో చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే కాదనేవాళ్ళు ఎవరు లేరు. ఇదే సమయంలో ఆ అవకాశం ఎంతుందన్నదే అసలు పాయింట్.
ఇక్కడ విషయం ఏమిటంటే ఎన్డీయే అభ్యర్ధిని ఓడించాలనే పట్టుదలతో నాన్ ఎన్డీయే పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలను వదిలేస్తే మూడు పార్టీలైన వైసీపీ, టీఆర్ఎస్, బీజేడీ కీలకమైనవి. వీటిల్లో ఏ ఒక్కపార్టీ మద్దతిచ్చినా ఎన్డీయే అభ్యర్ధి గెలుపు ఖాయం. అంటే ఎన్డీయే అభ్యర్ధి గెలవాలంటే కచ్చితంగా వైసీపీ మద్దతు చాలా కీలకమనేందుకు లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ మద్దతిచ్చే అవకాశం లేదు. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ మద్దతిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే జగన్ మద్దతు కూడా ఎన్డీయేకే దక్కే అవకాశముంది. కాబట్టి జగన్ మద్దతుమీదే ఎన్డీయే ఆధారపడుందని చెప్పేందుకు లేదు. ఈ విషయాలను వదిలేస్తే పై మూడు పార్టీలతో పాటు నాన్ ఎన్డీయే పార్టీల మద్దతే సంపూర్ణంగా ఉంటుందనే గ్యారెంటీ కనబడటం లేదు. స్వయంగా మమత పిలిస్తే కూడా ముఖ్యమంత్రులు ఎవరు హాజరు కాలేదు. మీటింగుకు హాజరైన పార్టీల్లో అత్యధిక పార్టీ పెద్ద బలం లేనివే.
పరిశీలనలో ఉన్న గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా పేర్లను చాలా పార్టీలు ఒప్పుకునే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్ధితుల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతని జగన్ చెప్పినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇపుడు కాదు 2024 ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు ఏపీ ఎంపీల మద్దతే ఆధారమన్నపుడు మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయాన్ని కేంద్రం ఆలోచిస్తుంది. ఏపీతో అవసరం లేనంతవరకు ఎంత ఒత్తిడి పెట్టినా ఏమాత్రం ఉపయోగముండదు.