రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ‘ఏక‌గ్రీవం..`’మారిన బీజేపీ వ్యూహం

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించి బీజేపీ యూట‌ర్న్ తీసుకుంది. ఈ ఎన్నికల్లో విపక్షాలు ప్రతిపాదించే అభ్యర్థికి.. అధికార పక్షం మద్దతు పలకనుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దీనికి బ‌లాన్ని చేకూరుస్తున్నాయి.

దేశ రాజ‌కీయాల్లో రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఓవైపు మమతా బెనర్జీ విపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు చేస్తుంటే.. అధికార బీజేపీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు పావులు కదుపు తోంది. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం తీసుకొచ్చే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు బీజేపీ అప్పగించింది. ఆయన ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నా రు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతో రాజ్నాథ్ మాట్లాడారు. ప్రధాని మోడీ తమ అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారని రాజ్నాథ్ తనతో చెప్పినట్లు ఖర్గే వెల్లడించారు. ప్రభుత్వ ప్రతిపాదనలు ఏంటన్న విషయాన్ని తాను అడిగినట్లు చెప్పారు. అభ్యర్థిని ఎవరిని నిలబెడుతున్నారని అడిగానని తెలిపారు. అయితే, తనతో సంప్రదింపులు కొనసాగించే విషయంపై రాజ్నాథ్ స్పష్టతనివ్వలేదని అన్నారు.

ఈ నేపథ్యంలోనే ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదాలు లేని అభ్యర్థి పేరును విపక్షాలు ప్రతిపాదిస్తే అందుకు ప్రభుత్వం మద్దతిస్తుందా? అని ప్రశ్నించారు. ఏకగ్రీవంగా అభ్యర్థిని గెలిపించే అవకాశం ఉందా? అని అడిగారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు సమావేశమవ్వాలని పిలుపునిచ్చిన బంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆదిలోనే చుక్కెదురైంది! సమావేశానికి టీఆర్ ఎస్‌, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గైర్హాజరు కానున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్ ఈ భేటీకి వస్తున్న నేపథ్యంలో కేసీఆర్‌.. భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మరో వైపు, అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే విపక్షాలకు మద్దతు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఒడిసా అధికార పార్టీ బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సైతం ఈ మీటింగ్కు దూరంగా ఉండనున్నాయి. తమకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ అందినా భేటీకి దూరంగా ఉండేవాళ్లమని ఎంఐఎం వెల్లడించింది. దీంతో బీజేపీకి న‌ల్లేరుపై న‌డకేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.