ప‌వ‌న్ సాయానికి మెగా కుటుంబం అండ‌.. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యానికి?

కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ ఈ నెల 19న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించును న్నారు. బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలను పవన్ పరామర్శించి ఒక్కో కుటుంబాలకు రూ. లక్ష చొప్పున అంద జేస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ తెలిపారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో బహి రంగ సభ కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు కుటుంబాలను ఆదుకోనున్నారు. ఆయన ‘కౌలు రైతుల భరోసా యాత్ర’ చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ రూ. 5 కోట్ల సొంత డబ్బును విరాళంగా ఇవ్వగా..తమ వంతుగా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు రూ.35 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు వారు పవన్‌కు చెక్కులు అందజేశారు. ఈ మొత్తాన్ని కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధిగా జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

మెగా ఫ్యామిలీకి చెందిన హీరో వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, వైష్ణవ్ తేజ్ రూ.5 లక్షలు, నిహారిక రూ.5 లక్షలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు స్పందించిన దాతలకు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. కౌలురైతులకు సాయం చేస్తున్న ప‌వ‌న్ విష‌యంలో అండ‌గా ఉన్న మెగా కుటుంబం.. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆయ‌న‌కు అండ‌గా ఉంటుందా? అనేది ఇప్పుడు కీల‌క ప్ర‌శ్న‌గా మారింది.

వాస్త‌వానికి గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. మెగా యువ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప‌వ‌న్ పార్టీకి అండ‌గా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. బాబాయి పెట్టిన పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు తాను సిద్ద‌మేన‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ప‌వ‌న్ కోసం.. ఆయ‌న విశాఖ వ‌చ్చి.. క‌లిసి మాట్లాడారు. త‌ర్వాత ఏం జ‌రిగిందో.. రామ్ చ‌ర‌ణ్ సైలెంట్ అయ్యారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఒక్క నాగ‌బాబు త‌ప్ప‌.. ప‌వ‌న్ రాజ‌కీయాల గురించి మాట్లాడిన వారు లేరు. ఇక‌, ఇప్పుడు మెగా కుటుంబం వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి యాక్టివ్ అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.