రెండేళ్లలో ఏం సాధిస్తారు? వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

ఏపీలో అధికార పార్టీ నేత‌ల అంత‌ర్మ‌థ‌నం తారాస్థాయికి చేరింది. ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండు సంవ‌త్స‌రాల‌ స‌మ‌య‌మే ఉంది. నిజానికి చెప్పాలంటే.. రెండేళ్ల స‌మ‌యం కూడా లేదు. ఏడాదిన్న‌ర మాత్ర‌మే ఉంది. చివ‌రి ఆరునెల‌లు.. అంద‌రూ ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళ్లిపోతారు. దీంతో మిగిలిన ఈ స‌మ‌యంలో ఏం చేస్తారు? స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారు? అనే చ‌ర్చ వైసీపీలోనే ఎక్కువ‌గా సాగుతోంది. ఎందుకంటే.. మూడేళ్లు గ‌డిచిపోయినా.. జ‌గ‌న్ పాల‌న‌లో ఒక్క ఇటుక కూడా ప‌డ‌ని ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి.

ఇవే అంశాల‌ను.. ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న పాద‌యాత్రలు, ‘గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం’ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. ప్రాజెక్టులు లేవు.. ఉపాధి లేదు.. రాష్ట్రానికి అప్పులు త‌ప్ప‌.. మిగిలింది ఏమీ క‌నిపించ‌డం లేదు.. అని పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. దీంతో ఎన్ని ప‌థ‌కాలు ఇచ్చినా.. ఎంత సొమ్ములు ధార‌పోయినా..యువ‌త ఉద్యోగాల‌ను కోరుకుంటున్నారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం.. అభివృద్ధిని కోరుతోంది.

ఈ నేప‌థ్యంలో ఆయా అంశాల‌కు ప్రాధాన్యం లేకుండా.. ఎన్ని చేసినా ప్ర‌యోజ‌నం లేద‌ని.. వైసీపీ నాయ కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఖ‌జానా కొల్ల బోతోంది. వ‌చ్చిన సొమ్ములు జీతాల‌కు ఇచ్చేందుకు, పెంన్ష‌న్ల‌కు ఇచ్చేందుకు మాత్ర‌మే స‌రిపోతోంది. దీంతో అభివృద్ధికి ప్ర‌త్యేకంగా కేటాయించే స‌మ‌యం, సొమ్ములు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా నెట్టుకురావాల‌నేది వైసీపీ నాయ‌కుల భావ‌న‌.

ఇదే విష‌యంపై.. ఇటీవ‌ల మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ నిర్వ‌హించిన‌.. ఉత్త‌రాంధ్ర వింగ్ వైసీపీ స‌మావే శంలో నేత‌లు ప్ర‌శ్నించారు. “మీరు చెబుతారు.. మేం ప్ర‌జ‌ల్లోకి వెళ్తాం. కానీ.. అక్క‌డ రోడ్లు అడుగుతున్నారు. తాగు నీటి ప‌థ‌కాల‌ను కోరుతున్నారు. కానీ, డ‌బ్బులు లేవు. ఏం చేయాలి? ఇలా అయితే.. మా మొహం ప్ర‌జ‌ల‌కు ఎలా చూపించాలి?” అని నేత‌లు ప్ర‌శ్నించారు. దీంతో వీరికి స‌మాధానం చెప్పలేక‌.. అందుకే ఈ స‌మావేశం నిర్వ‌హించామ‌ని.. మీస‌మ‌స్య‌లు చెబితే.. సీఎం దృష్టికి తీసుకువెళ్తామ‌ని..చెప్పి..బొత్స స‌మావేశాన్ని ముగించార‌ట‌. ఇదీ.. సంగ‌తి!!