తెలంగాణ కాంగ్రెసులో ఇతర పార్టీల నేతల చేరిక లేనట్లేనా..? ఇక్కడ నుంచి బయటికి వెళ్లడమే కానీ.. కొత్తగా వచ్చే వారెవరూ కనపడడం లేదా..? రావడానికి ఆసక్తి చూపుతున్న కొద్ది మంది నేతలను కొందరు అడ్డుకుంటున్నారా..? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ లక్ష్యానికి సీనియర్లు తూట్లు పొడుస్తున్నారా..? చేరికల కమిటీ ఏర్పాటు ఉత్తదేనా..? అంటే పార్టీ వర్గాలు అవుననే సమాధానాలు ఇస్తున్నాయి.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకానికి ముందు పార్టీ స్తబ్దుగా ఉన్న విషయం తెలిసిందే. ఉత్తమ్ హయాంలో పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్లు పార్టీని విడిచి కారెక్కారు. ప్రముఖులందరూ పార్టీని విడిచి వెళుతున్నా ఉత్తమ్ ఆపలేకపోయారు. దీంతో మిగతా కాంగ్రెస్ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా వలస బాట పట్టారు. ఉన్న కొద్ది మందీ నిరాశ నిస్ప్రహలతో కొట్టుమిట్టాడారు. దీంతో కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించేస్తుందన్న భావనలు కలిగాయి.
కానీ, రేవంత్ నియామకంతో అవన్నీ పటాపంచలైపోయాయి. ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేవంత్ వచ్చీ రావడంతోనే పార్టీని పట్టాలెక్కించి పరుగులు తీసేలా చేశారు. తన ధాటైన వాగ్దాటితో ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ తీసుకొచ్చారు. వరుస బహిరంగ సభలు, ర్యాలీలతో జనాలకు కాంగ్రెస్ ను ఒక ఆశాజ్యోతిలా కనిపించేలా చేశారు. దీంతో రేవంత్ అంటే పడని ఒకరిద్దరు నేతలు మినహా వలసలకు అడ్డుకట్ట పడింది.
అయితే.. రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యాక పార్టీలోకి వలసలు జోరందుకుంటాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే రేవంత్ కూడా ఘర్ వాపసీ పేరిట పార్టీని విడిచి వెళ్లిన వారి వద్దకు, ఇతర పార్టీల ముఖ్యుల వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. అందులో కొందరు వేచి చూసే ధోరణి ప్రదర్శించగా.. మరికొందరు కాంగ్రెసులో చేరడానికి ఆసక్తి చూపారు. ఇందులో ముఖ్యంగా ధర్మపురి శ్రీనివాస్, ఆయన కుమారుడు సంజయ్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎర్ర శేఖర్ తదితర మాజీ ప్రజాప్రతినిధులు పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
అయితే.. ఇపుడు కాంగ్రెసు తీసుకున్న నిర్ణయం వారి ఆశలను నిరాశ చేసేలా ఉంది. ఇటీవల రాష్ట్రస్థాయి చింతన్ శిబిర్ లో తీసుకున్న నిర్ణయాల్లో కాంగ్రెసు నుంచి బయటికి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోవద్దనే తీర్మానానికి ఆమోదం తెలిపారు. బూత్ సభ్యుడి స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఎవరినీ తిరిగి చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఆశావహుల అంచనాలు తలకిందులయ్యాయి. ఒకవేళ నిజంగానే ఈ ప్రతిపాదనను అమలు చేస్తే కాంగ్రెసుకు తీరని నష్టం కలుగజేస్తుందని.. అందరూ బీజేపీలోకి వెళతారని పరిశీలకులు భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో..!