ప్రస్తుతం జనసేనను మరింత ముందుకు తీసుకువెళ్లే వ్యూహం ఒకటి సిద్ధం చేస్తున్నారు పవన్ కల్యాణ్ . ఆ క్రమంలో మరింత విశిష్టం అయిన రీతిలో పార్టీని పటిష్టం చేయాలని అనుకుంటున్నారు. అందుకే అటు సోదరుడు నాగబాబు కూడా తమ్ముడి ఆలోచనకు అనుగుణంగా పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ దశలో పాత గాయాలు కొన్ని ప్రజా రాజ్యం పార్టీ రూపంలో ఉండడంతో వాటిని మరిచిపోలేకపోతుండడంతో నాగబాబు కూడా చాలా చోట్ల చాలా ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రజా రాజ్యం వేరు జనసేన వేరు అని ఓ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడ్రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో నాగబాబు ఏం నేర్చుకున్నారు ? అధినేత అయిన పవన్కు ఏం చెప్పాలనుకుంటున్నారు ? అన్నవే ఇప్పుడిక చర్చకు తావిచ్చే విషయాలు. ప్రశ్నలు కూడా !
వాస్తవానికి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయాలని యోచిస్తున్నారు పవన్ కల్యాణ్. ఇక్కడ బలోపేతం అయితే మిగతా చోట్ల కూడా కంచు నగారా మోగించవచ్చన్నది ఆయన భావన.నిన్న కూడా నాగబాబు ఈ ప్రాంత భౌగోళిక అస్తిత్వాన్నీ, ఇక్కడి ప్రజల సమస్యలనీ ఇలా ఒక్కటేంటి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. రుషి కొండను పాలక ప్రభుత్వం ఏ విధంగా తవ్వేసిందో చూశాం కదా ! ఇక మేం చెప్పేదేముంది అంటూ కీలక సమస్యనూ అడ్రస్ చేశారు.
ఇదే సమయంలో పర్యావరణ విఘాత అభివృద్ధిపై కూడా మాట్లాడారు. కానీ లోతైన అధ్యయనంతో అయితే ఆయన మాట్లాడలేకపోయారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండానే దాటేశారు. అయినా కూడా నాగబాబును తమ్ముళ్లు బాగానే ఆదరించారు. నెత్తిన పెట్టుకుని ఆయన పర్యటనను విజయవంతం చేశారు. ఇప్పుడు పవన్ ముందున్న సవాళ్లు.
రుషి కొండకు సంబంధించి మరింత లోతుగా అధ్యయనం చేసి మాట్లాడడం.. అదేవిధంగా శ్రీకాకుళం లాంటి మారుమూల ప్రాంతాల్లో సముద్రంపైనే జీవన యానం చేస్తున్న మత్స్యకారుల సమస్యలపై పోరాడడం.. ఈ రెండూ చేస్తే పవన్ కు మరింత విశ్వసనీయత పెరుగుతుంది. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నాగబాబు వరకూ పార్టీకి సంబంధించి కొన్ని మరమ్మతులు చేసినా అవి చాలవు. బండి మరింత జోరు అందుకోవాలంటే పొత్తులపై పవన్ క్లారిటీ ఇస్తేనే మేలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates