టీడీపీ ఓటమికి కారణం చెప్పిన బీజేపీ ఎంపీ

తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినందుకు కారణం ఏమిటి? ఈ విషయామై చంద్రబాబు నాయుడు అనేకసార్లు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి తాను ఎంత కష్టపడినా జనాలు తమపార్టీని ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్ధం కావటంలేదని చాలాసార్లే చెప్పారు. అలాంటిది టీడీపీ ఘోర ఓటమి కారణాన్ని  బీజేజీలోకి ఫిరాయించిన టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ చాలా సింపుల్ గా తేల్చేశారు.

ఇంతకీ వెంకటేష్ చెప్పిందేమంటే తన హయాంలో చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధిచేశారట. అయితే ఏ ప్రాంతాన్ని ఎంతగా అభివృద్ధిచేసినా 24 గంటలూ కేవలం అమరావతి గురించి మాత్రమే మాట్లాడారట. దాంతో రాష్ట్రమంటే అమరావతి తప్ప మరేమీ లేదా అనే వ్యతిరేకత జనాల్లో వచ్చేసిందట. అందుకనే జనాలు టీడీపీని అంత ఘోరంగా ఓడించినట్లు వెంకటేష్ కనిపెట్టేశారు.

మరి ఇదే నిజమైతే రాజధాని అమరావతిని అభివృద్ధి చేసినా గుంటూరు, కృష్ణాజిల్లాల్లో కూడా టీడీపీ ఎందుకు ఓడిపోయిందనే ప్రశ్నకు వెంకటేష్ ఏమని సమాధానం చెబుతారో.  అమరావతి జపం వల్ల రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మిగిలిన ప్రాంతాల ప్రజలకు తెలియలేదన్నారు. వెంకటేష్ చెప్పినట్లు అమరావతి కారణంగానే మిగిలిన ప్రాంతంలో జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది నిజమే అనుకుందాం. మరి అమరావతి ప్రాంతంలోని రెండు జిల్లాల్లో టీడీపీ గెలవాలి కదా. మిగిలిన ప్రాంతాలతో పాటు రాజధాని జిల్లాల్లో కూడా ఎందుకని ఓడిపోయిందో వెంకటేష్ చెప్పలేకపోయారు.

ఇదే సమయంలో రాష్ట్రంలోని శీతాకాల రాజధానులుగా విశాఖపట్నం, కర్నూల్లో ఏర్పాటు చేయాలన్నారు. అమరావతినే శాశ్వత రాజధానిగా కంటిన్యూ చేయాలనే డిమాండును కూడా ఎంపీ వినిపించారు. వేసవి, శీతాకాల రాజధానుల కాన్సెప్టు ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న విషయాన్ని ఎంపీ గుర్తుచేశారు. అమరావతి మీద వ్యతిరేకతతో వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్ళటం ఎంతమాత్రం మంచిదికాదని వెంకటేష్ స్పష్టంచేశారు. మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణాన్ని, రాజధానుల వివాదానికి ఒక సూచనను బీజేపీ ఎంపీ ఢిల్లీలో ప్రకటించారు.