సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా.. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద నిర్వహించిన సభలో.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నోరు జారారు. ఏకంగా.. ఆయన వైసీపీ అధినేత.. తనకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్‌పైనే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్పై మాట జారారు. ముఖ్యమంత్రి జగన్ ను ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని నోరు జారారు.. కారుమూరి నాగేశ్వరరావు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం వద్ద నిర్వహించిన సభలో.. చంద్రబాబును విమర్శిస్తున్న క్రమంలో మంత్రి తడబడ్డారు.
జగన్ కాలం చెల్లిన నేత అంటూ వ్యాఖ్యానించారు. అంతకు ముందు జగన్ అందరి ఇంట్లో వ్యక్తిగా మారారంటూ మంత్రి పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే.. మంత్రి తడబడడం.. ఈ క్రమంలో ఏకంగా.. సీఎం జగన్‌పై కామెంట్లు చేయడం ఆసక్తిగా మారింది. నిజానికి గతంలోనూ మంత్రి నారాయణస్వామి తడబడ్డారు. ఎస్సీలకు మేలు చేసింది.. చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఇక్కడ జగన్ను ఏదో ఆకాశానికి ఎత్తేయాలనే తపన తప్ప.. నాయకుల్లో ఏమీ కనిపించడం లేదు. విషయానికి ప్రాధాన్యం ఇచ్చి.. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తే.. ఎలాంటి సమస్యా రాదు. కానీ.. ఒకరిని మించి మరొకరు.. జగన్‌ను ఆకాశానికి ఎత్తేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కామెంట్లు తరచుగా.. ఇలా జగన్‌పై సొంత మంత్రులే విమర్శలు చేసే పరిస్థితిని కల్పిస్తోంది.
మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సామాజిక న్యాయం జరుగుతోంది. కేబినెట్‌లో 17 మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మంత్రులు ఉన్నారు. మేమంతా సీఎం జగన్ తయారు చేసిన సైనికులం’’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎవరూ సామాజిక న్యాయం పాటించలేదు. సీఎం జగన్ ఒక్కరే సామాజిక న్యాయం పాటించారు’’ అని తెలిపారు.
ఇదిలావుంటే.. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేస్తు నిర్వహిస్తున్న బస్సు యాత్ర.. సామాజిక నయవంచన యాత్ర అంటూ సామాజిక హక్కుల వేదిక నేతలు విమర్శలు చేశారు. రాష్ట్ర మంత్రులు నిర్వహిస్తున్న బస్సు యాత్రకు వ్యతిరేకంగా సామాజిక హక్కుల వేదిక నేతలు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ వర్గానికి చెందిన డ్రైవర్ ను హత్యచేస్తే, ఆ వర్గాల్లో వ్యతిరేకత వచ్చిందని ప్రభుత్వం మంత్రులతో బస్సు యాత్ర చేయిస్తోందని విమర్శించారు. సీఎం జగన్ కు సామాజిక బాధ్యత ఏమాత్రం లేదని అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.