జగన్ పాలనలో ఏపీకి ఒరిగిందేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. విజయవాడలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్లేసిన వాళ్లకు అన్నీ చేసేద్దాం.. ఓట్లేయని వాళ్లను పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా జగన్ పాలన ఉందన్నారు. ప్రజలను వైసీపీ మోసం చేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీకే మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. వీళ్లలో వీళ్లు తిట్టుకుంటారే కానీ బీజేపీని మాత్రం ఒక్కమాట కూడా అనరని ఉండవల్లి పేర్కొన్నారు.
సీఎంలు మారినా ఏపీ సమస్యలు మాత్రం అలానే ఉన్నాయన్నారు. పోలవరం కింద రూ.30 వేల కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకే పోలవరం నిర్మాణానికి కేంద్రం ఆసక్తి చూపడం లేదన్నారు. కనీసం ప్రాజెక్ట్ పూర్తి చేయకపోయినా.. 41 మీటర్లు ఆనకట్టగా అయినా అభివృద్ధి చేయాలని ఉండవల్లి సూచించారు. ఇక, ఏపీతో పాటు. దేశం మొత్తం అప్పులు చేస్తున్నా.. ఏపీలోని వైసీపీ ప్రబుత్వం చేస్తున్న స్థాయిలో అప్పులు ఎవరూ చేయడం లేదన్నారు. జగన్ చేస్తున్న అప్పలకు అంతం ఎప్పుడు ఉంటుందో కూడా తెలియడం లేదన్న ఉండవల్లి.. వీటికి ఎప్పుడో ఒకప్పుడు.. ఎండ్ పడుతుందన్నారు.
ఇక, నవరత్నాలను అమలు చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెడుతోందన్న ఉండవల్లి.. ఇతర అభివృద్ధి కార్యక్రమాలను జగన్ సర్కారు విస్మరించిందని పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్రం వందేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు.గతంలో ఏ ప్రబుత్వమూ.. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ అప్పులు చేస్తున్నారని.. ఎక్కడి దొరికితే.. అక్కడ అప్పులు తెస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్ల ద్వారా… బాండ్ల విక్రయం ద్వారా కూడా.. జగన్ అప్పులు చేస్తున్నారని విమర్శించారు.
“అప్పులు చేసి.. సంక్షేమాన్ని ఎన్నాళ్లు చేస్తారో..చూడాలి. వచ్చే ఎన్నికల వరకు అయితే.. కొనసాగిస్తారని నేను అనుకోవడం లేదు. కానీ, ఎప్పటి వరకు.. ఎంత వరకు ఇలా అప్పులు చేస్తారనేది ఎవరూ ఊహించని పరిణామంగా ఉంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కూడా 100.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. వాళ్లు అప్పులు చేస్తూ.. రాష్ట్రాలను అప్పుల ఊబిలో దించుతున్నారు. ఇది దేశాన్ని ఎటువైపు తీసుకువెళ్తుందోనని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం” అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates