మల్లారెడ్డికి లైఫ్ ఇచ్చిన చంద్రబాబు

మాజీ ఎంపీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మళ్లీ పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్య కల్పనను మల్లారెడ్డి మరోసారి వివాహమాడబోతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనకు ఫాలోయింగ్ ఎక్కువని, ఫాలోవర్ల కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నానని తనదైన శైలిలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నెలకోసారి తన ఫాలోవర్స్ కోసం ఏదో ఒకటి చేస్తుంటానని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.

ఇక, ఏపీ రాజకీయాలపై కూడా మల్లారెడ్డి స్పందించారు. చంద్రబాబు మంచి విజన్ ఉన్న లీడర్ అని, ఆయన దగ్గర తాను పనిచేశానని అన్నారు. చంద్రబాబు తనకు లైఫ్ ఇచ్చారని, 2014లో మహామహులను కాదని తనకు ఎంపీ టికెట్ ఇవ్వడం తన అదృష్టమని చెప్పారు.

హైటెక్ సిటీ, హైదరాబాద్ డెవలప్మెంట్ లో చంద్రబాబు పాత్ర చాలా ఉందన్నారు. ఇక, సీఎంగా జగన్ బాగా చేశాడని, స్కూల్స్,ఇంటి దగ్గరే రేషన్, ఇంటి దగ్గరకే పెన్షన్ వంటి పథకాలు వెళ్లడం, అమ్మఒడి బాగున్నాయని కితాబిచ్చారు. కానీ, చివర్లో ఫినిషింగ్ బాగోలేదని, అందుకే ఓడిపోయారని చెప్పారు.

ఇక, జనసేనాని పవన్ చాలా మంచోడని ప్రశంసించారు. తనలాగే పవన్ మనసులో ఏదున్నా ఓపెన్ గా చెప్పేస్తాడని పొగడ్తలతో ముంచెత్తారు. పవన్ తెలివిగా ఒక మంచి పని చేశాడని, ప్రధాని మోదీతో చంద్రబాబును 2024 ఎన్నికలకు ముందు కలిపి సక్సెస్ అయ్యాడని చెప్పారు.

తాను..పాలమ్మి..పూలమ్మి…కోట్లు సంపాదించానంటే కాదు భూదందాలు చేసి సంపాదించారని కొందరు విమర్శిస్తుంటారని చెప్పారు. అయితే, తాను వ్యాపారం, విద్యా సంస్థలు..ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ సంపాదించానని చెప్పుకొచ్చారు.