ఎంపికల్లో ఈ జాగ్రత్త ఉండాలి జగన్

నియోజ‌క‌వ‌ర్గాల‌కు నాయ‌కుల‌ను ఎంపిక చేస్తున్న జ‌గ‌న్‌పై అదే నాయ‌కుల నుంచి అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తమ ఒత్తిడితోనే జ‌గ‌న్ ఈ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా ?  లేక‌.. పార్టీ కోణంలో తీసుకుంటున్నారో అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం కొంద‌రు నాయ‌కుల‌ను నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జ్‌లుగా నియ‌మించారు. వీరే పార్టీని ముందుకు న‌డిపించాల‌ని కూడా తేల్చి చెప్పారు. పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌న్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. అంటే మూడేళ్ల‌పాటు పార్టీని న‌డిపించినా.. చివ‌ర‌కు టికెట్ విష‌యంలో పేచీ పెడితే.. త‌మ ప‌రిస్థితి ఏంటన్న‌ది నాయ‌కుల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. గ‌తంలో ఇలాంటి అనుభ‌వాలు చాలా మందికి ఉన్నాయి. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ముందుండి న‌డిపించిన రాజ‌శేఖ‌ర్‌కు చివ‌రి నిమిషంలో టికెట్ లేకుండా చేశారు. చీరాల‌లో పార్టీకి స‌హ‌క‌రించిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ప‌రిస్థితి కూడా అలానే ఉంది.

ఈ రెండు చోట్లే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఇలానే మారింది. దీంతో అప్ప‌ట్లో నాయ‌కులు పార్టీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో ర‌గిలిపోయారు. కానీ, ఆల్ట‌ర్నేట్ లేక‌పోవ‌డంతో స‌ర్దుకున్నారు. కానీ, ఇప్పుడు ఆల్ట‌ర్నేట్ పార్టీలు ఉన్నాయి. అవి కూడా నాయ‌కుల‌ను చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు తీసుకునే ప్ర‌తి స్టెప్‌లోనూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌న్న‌ది సీనియ‌ర్లు చెబుతున్న మాట‌. నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌లు ఇస్తే.. ఆయ‌నకే టికెట్ కూడా ఇవ్వాల‌ని కోరుతున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు .. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ సీఎం జ‌నార్ద‌న్‌రెడ్డికుమారుడు రాంకుమార్‌రెడ్డికి పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు. కానీ, ఎన్నిక‌ల వ‌ర‌కు ఈయ‌న‌ను కొన‌సాగిస్తారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. గుంటూరు బాధ్య‌త‌ల‌ను పోతిన మ‌హేష్‌కు ఇచ్చారు. ఈయ‌న ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది.

సో.. దీంతో వీరు నియోజ‌క‌వ‌ర్గాల్లో అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీ త‌మ‌కు బ‌లమైన భ‌రోసా ఇస్తే త‌ప్ప‌.. రూపాయి ఖ‌ర్చు విష‌యంలో కానీ.. పార్టీ కార్య‌క్ర‌మాల విష‌యంలో కానీ.. దూకుడు చూపించ‌లేమ‌ని అంత‌ర్గ‌తంగా చెబుతున్నారు. ఈ విష‌యంపైనా జ‌గ‌న్ దృష్టి పెట్టాల్సి ఉంది.