చంద్రబాబునాయుడుతో పాటు నారా లోకేష్ కూడా జనాల్లోకి వచ్చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలుపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గడచిన 15 రోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఏ జిల్లాకు వెళ్ళినా ముందు పార్టీ నేతలతో, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. తర్వాత చిన్నపాటి సభలు, రోడ్డుషోలు నిర్వహిస్తున్నారు. తన పర్యటనలో అన్నీ ప్రాంతాలను టచ్ చేసేట్లుగా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు.
ఒకవైపు చంద్రబాబు పర్యటన జరుగుతుండగానే మరోవైపు లోకేష్ కూడా జనాల్లోకి వచ్చేశారు. లోకేష్ కూడా విజయనగరం జిల్లాలోని రాజాంలో పర్యటన ప్రారంభించారు. ఈయన కూడా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని నేతలు, కార్యకర్తలతో ముందు సమావేశమై తర్వాత రోడ్డుషో నిర్వహించారు. రోడ్డుషోలో మాట్లాడుతు ప్రభుత్వంపై యుద్ధానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఒకవైపు చంద్రబాబు మరోవైపు లోకేష్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు ఒకవైపు బస్సుయాత్ర మొదలుపెడితే లోకేష్ మరోవైపు నుండి సైకిల్ యాత్ర మొదలుపెడతారనే ప్రచారం జరిగింది. అయితే జరిగిన ప్రచారానికి భిన్నంగా ఇద్దరు మామూలుగానే తమ యాత్రలు ప్రారంభించారు. చంద్రబాబు పర్యటనలు ఒక ప్లాన్ ప్రకారం రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో జరుగుతోంది. మరి లోకేష్ కేవలం విజయనగరం జిల్లా పర్యటనకు మాత్రమే వచ్చారా లేకపోతే ఈయన కూడా రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో తిరుగుతారా అన్నది క్లారిటిలేదు. ఇద్దరి పర్యటనల్లోను జనసమీకరణ బాగానే జరుగుతోంది.
ఎన్నికలకు ఇంకా రెండేళ్ళున్నపుడే ఇద్దరు యాత్రల పేరుతో జనాల్లోకి వచ్చేస్తే కొంచెం ఇబ్బందుంది. అదేమిటంటే ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై కొత్తగా వీళ్ళు చేసే ఆరోపణలు ఏముంటాయి ? నిజానికి ఇద్దరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గడచిన మూడేళ్ళుగా ఇదే పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాల్లో రెండేళ్ళు టెంపో మైన్ టెన్ చేయటం అంత సులభంకాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ దగ్గరున్న అన్నీ అస్త్రాలను ఇపుడే వాడేస్తే ఇక ఎన్నికల ప్రక్రియ మొదలైనపుడు వాడటానికి ఏమీ ఉండదు. ఈ విషయం చంద్రబాబు గుర్తుంచుకుంటే బాగుంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates