అప్పుడెప్పుడో అంటే దాదాపు రెండేళ్ల క్రితమే ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టానికి ఇంతవరకు అతీగతీ లేదు. దిశ చట్టం బిల్లును ఆమోదించాల్సింది కేంద్ర ప్రభుత్వం. అందుకనే రాష్ట్రంలో పోలీసు, న్యాయ శాఖల ఉన్నతాధికారులు దిశ చట్టం బిల్లును రూపొందించారు. దాన్ని అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించాయి. తర్వాత అదే బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్రంలో ముందు న్యాయశాఖ పరిశీలిస్తుంది. తర్వాత హోంశాఖకు వెళ్ళి తర్వాత క్యాబినెట్ కు చేరుతుంది.
క్యాబినెట్ సమావేశంలో బిల్లుకు ఆమోదం పొందిన తర్వాత ఫైనల్ గా రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం అయిపోతే బిల్లుకు చట్టం రూపం వచ్చేసినట్లే. అంటే రాష్ట్రపతి ఆమోదం పొందిన నాటినుండి దిశచట్టం అమల్లోకి వస్తుందన్నమాట. కేంద్రం ఆమోదం పొందుతుందన్న ఉద్దేశ్యంతోనే దిశ చట్టం పేరుతో ప్రభుత్వం కొన్ని పోలీసు స్టేషన్లను కూడా ఏర్పాటు చేసేసింది. దిశ పేరుతో ప్రత్యేకంగా యాప్ కూడా రిలీజ్ చేసింది. అయితే బిల్లుకు కేంద్రం ఏవో అడ్డంకులు పెట్టి తిప్పి పంపింది.
కేంద్రం వేసిన కొర్రీలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పి మళ్ళీ బిల్లును కేంద్రానికి పంపింది. రెండోసారి అన్ని శాఖల పరిశీలన తర్వాత రెండోసారి కూడా బిల్లును కేంద్రం తిప్పి పంపేసింది. రెండోసారి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి రాష్ట్రం మళ్ళీ బిల్లును మూడోసారి కేంద్రానికి పంపింది. అయితే దిశ బిల్లు కేంద్రంలో ఏ స్ధితిలో ఉందో జనాలకు అర్థం కావటంలేదు. అసలు ఒక బిల్లును కేంద్రం రెండుసార్లు రాష్ట్రానికి తిప్పిపంపటం ఏమిటో అర్ధం కావటం లేదు.
బిల్లు రూపొందించేటపుడే అన్నీ వ్యవహారాలను ఒకటికి పదిసార్లు చూసుకుని తయారు చేయాలన్న ఆలోచన అధికారులకు ఎందుకు ఉండటం లేదో. న్యాయ, పోలీసు ఉన్నతాధికారులు పకడ్బందీగా బిల్లును తయారు చేస్తే కేంద్రం రెండు సార్లు ఎందుకు తిప్పిపంపుతుంది ? అంటే రాష్ట్రంలో ఉన్నతాధికారులు తయారుచేసిన బిల్లులో లోపాలున్నాయని అర్ధమవుతోంది. బిల్లును అదేపనిగా అడ్డుకోవాల్సిన అవసరమైతే కేంద్రానికి లేదు. నియమ, నిబంధనలను పాటించి, చట్టపరంగా గట్టి సెక్షన్లతో బిల్లు తయారు కాలేదన్న ఉద్దేశ్యంతోనే కేంద్రం అడ్డుకునుంటుంది. ఉన్నతాధికారులు దగ్గరుండి బిల్లుకు ఆమోదం తెప్పించుకోవాల్సిన అవసరం రాష్ట్రానికే ఉంది.